తెలంగాణ రెరా అథారిటీ గురువారం కీలక తీర్పునిచ్చింది. హఫీజ్‌పేట్ సర్వే నెం. 80లో.. ప్రీలాంచ్ అమ్మకాలు జరుపుతున్న బిల్డాక్స్ సంస్థపై రూ.3.96 కోట్ల జరిమానాను విధించింది. ఈ మేరకు గురువారం విచారణ జరిపిన అనంతరం తాజా తీర్పును వెలువరించింది. బిల్డాక్స్ జారీ చేసిన ప్రకటన ఫేస్‌బుక్‌లో కొనసాగుతున్నందు వల్ల.. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ.. కొనుగోలుదారుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నదని గ్రహించిన టీఎస్ రెరా అథారిటీ.. 59, 60 సెక్షన్ల ప్రకారం అపరాధ రుసుమును విధించింది. బిల్డాక్స్ తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని కోరినప్పటికీ..
బిల్డాక్స్ ప్రకటనలు ఫేస్‌బుక్‌లో ఇంకా కొనసాగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న రెరా అథారిటీ.. కొనుగోలుదారులు మోసానికి గురికాకుండా ఉండేందుకు అపరాధ రుసుమును విధించినట్లు టీఎస్ రెరా అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బిల్డాక్స్ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలు కొనసాగించకూడదని టీఎస్ రెరా అథారిటీ బిల్డాక్స్‌కు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఫేస్ బుక్ ప్రకటనలు వెంటనే తొలగించాలని రెరా ట్రిబ్యునల్ బిల్డాక్సు ను ఆదేశించింది.
This website uses cookies.