గండిపేట్, కోకాపేట్, పుప్పాలగూడ తదితర ప్రాంతాల్లో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా నూతనంగా అత్యాధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (Vertical Water Treatment Plant) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు నీటి ఊరట కలిగించేలా ఈ చర్యలు చేపట్టనుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ల నుంచి అదనంగా సరఫరా చేసే నీటిని శుద్ధి చేయడానికి గండిపేట్ కాండూట్ మీద ఈ వర్టికల్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను నిర్మిస్తారు. బుధవారం గండిపేట్ కాండూడ్ మీద గండిపేట్, కోకాపేట్, పుప్పాలగూడ ప్రాంతాల్లో 3 ఎమ్ఎల్డీల సామర్ధ్యం కలిగిన 3 అత్యాధునిక వర్టికల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించడానికి అనువైన స్థలాన్ని ఎండీ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ పరిధిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లే జలమండలి ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడిందన్నారు. గండిపేట్, కోకాపేట్, పుప్పాలగూడ సమీప ప్రాంతాల్లో అదనంగా 9 ఎంఎల్డీల మంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లను రోజూ 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రజలకు సరిపడా తాగునీరు సరఫరా
హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరాకు కొరత లేదని జలమండలి పునరుద్ఘాటిస్తోంది. ప్రస్తుతం నగరానికి నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు నుంచి నీరు సరఫరా జరుగుతోంది. ఇవే కాకుండా జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి కూడా నీరు సరఫరా చేస్తున్నారు.
క్రమ.సంఖ్య జలాశయం పేరు, సరఫరా చేస్తున్న నీరు (ఎంఎల్డీలలో),
1 ఉస్మాన్ సాగర్, 91.00
2 హిమాయత్ సాగర్, 12.32
3 సింగూరు, మంజీరా 460.00
4 కృష్ణా ఫేజ్- 1, 2, 3, 1254.33
5 గోదావరి ఫేజ్-1, 741.45
మొత్తం 2559.00
నీటి సరఫరా ఇలా..
ఇందులో నుంచి జీహెచ్ఎంసీ ప్రాంతానికి 1082.62 ఎంఎల్డీ, జీహెచ్ఎంసీ అవతల ప్రాంతాలకు 1049.58 ఎంఎల్డీలు, ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు 277.21 ఎంఎల్డీలు, మిషన్ భగీరథ కోసం 149.47 ఎంఎల్డీల నీరు సరఫరా చేస్తున్నారు.
హైదరాబాద్ సమీపంలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో సమృద్ధిగా నీటి లభ్యత ఉంది. పైన పేర్కొన్న జలాశయాల నుంచి ప్రస్తుతం మొత్తం 2409.53 ఎంఎల్డీల నీరు సరఫరా జరుగుతోంది. గతేడాది ఇదే రోజు 2270 ఎంఎల్డీల నీరు సరఫరా చేశారు. అంటే ఈ ఏడాది అదనంగా 139.53 ఎంఎల్డీల నీరు సరఫరా చేస్తున్నారు.
నాగార్జున సాగర్
నాగార్జున సాగర్ లో ఈ రోజు (03.04.204) వరకు 136.47 టీఎంసీల నీరు ఉంది. 131.66 టీఎంసీల వరకు డెడ్ స్టోరేజీ లభ్యత ఉంది. డెట్ స్టోరేజీ ఉన్నా.. 4.81 టీఎంసీల నీరు వాడుకోవచ్చు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 4 నెలలకు గానూ 5.60 టీఎంసీల నీరు అవసరం.
ఎల్లంపల్లి రిజర్వాయర్
ఎల్లంపల్లి రిజర్వాయర్ లో నేడు (03.04.204) 7.71 టీఎంసీల నీరుంది. 3.31 టీఎంసీల వరకు డెడ్ స్టోరేజీ లభ్యత ఉంది. డెట్ స్టోరేజీ ఉన్నా.. 4.40 టీఎంసీల నీరు వాడుకోవచ్చు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 4 నెలలకు గానూ 3.33 టీఎంసీల నీరు అవసరం.
ఎమర్జెన్సీ పంపింగ్ కు ఏర్పాట్లు
ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎమర్జెన్సీ పంపింగ్ కు జలమండలి ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. నాగార్జున సాగర్ నుంచి ఈ నెల 15 నుంచి.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మే 1 నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేయనుంది.
ట్యాంకర్ సరఫరా
ట్యాంకర్ డిమాండ్ ఏర్పడటానికి గల కారణాలు తెలుసుకోవడానికి జలమండలి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కారణమని తేలింది. అలాగే భూగర్భ జలాల శాఖ కూడాఇదే విషయాన్ని వెల్లడించింది. ట్యాంకర్ బుక్ చేసే వినియోగదారులకు నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిబ్బంది రాత్రింబగళ్లు పనిచేస్తున్నారు. ట్యాంకర్ డిమాండ్ నగరమంతా కాదు కానీ.. పశ్చిమ ప్రాంతాలైన మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లోనే అధికంగా ఏర్పడింది. ఇక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా విషయానికి వస్తే.. ప్రస్తుతం 644 ట్యాంకర్లు సేవలు అందిస్తున్నాయి. నిన్న ఒక్కరోజు 6593 ట్రిప్పుల నీరు సరఫరా చేశారు.
సవాళ్లు అధిగమించి..
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి.. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. ఈ రోజు కూడా మిషన్ భగీరథ పరిధిలోని ప్రాంతాలైన గజ్వేల్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ ప్రాంతాలకు 149.47 ఎంఎల్డీల నీరు సరఫరా చేశారు.
గతేడాది జంట జలాశయాల నుంచి నీరు వాడుకునేందుకు అనుమతి లేకపోవడం. దీని వల్ల 4 ఎంజీడీల నీరు మాత్రమే వాడుకున్నారు. ప్రస్తుతం ఈ జలాశయాల నుంచి 24 ఎంజీడీల నీరు సరఫరా చేశారు. మే నెలలో 40 ఎంజీడీల నీరు వాడుకునేందుకు జలమండలి ప్లాన్ చేస్తోంది.
సుంకిశాల ప్రాజెక్టు
సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. త్వరలోనే పనులు పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకు వస్తారు. జలమండలి పరిధిలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి హైదరాబాద్ మహానగరానికి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. అంతేకాకుండా.. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా కూడా తాగు నీరందిస్తోంది.