రెండు ఆప్షన్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఇండెక్సేషన్ లేకుండా కొత్త పన్ను లేదా ఇండెక్సేషన్ ప్రయోజనంతో పన్ను చెల్లించే చాన్స్
ప్రాపర్టీ కొనుగోళ్లకు సంబంధించి ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. 2024 జూలై 23కి ముందు జరిగిన ఆస్తి కొనుగోళ్లపై రియల్ ఎస్టేట్ ఇండెక్సేషన్ ప్రయోజనాల ఆధారంగా, అలాగే ఇండెక్సేషన్ లేకుండా కొత్తగా తీసుకొచ్చిన తక్కువ రేటు ఆధారంగా పన్ను చెల్లించే అవకాశం కల్పించింది. ఈ మేరకు సదరు బిల్లులో సవరణలు చేసింది. ఓ వ్యక్తి లేదా అవిభాజ్య హిందూ కుటుంబం 2024 జూలై 23 కంటే ముందు కొనుగోలు చేసిన భూమి లేదా భవనాలు లేదా రెండింటికి సంబంధించిన దీర్ఘకాల మూలధన ఆస్తిని బదిలీ చేసే విషయంలో పాత లేదా కొత్త పన్ను విధానం ప్రకారం లెక్కించి, ఏది తక్కువైతే అది చెల్లించడానికి ప్రభుత్వం అనుమతిస్తుందని అధికార వర్గాలు వివరించాయి.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దీర్ఘకాల మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించిన సంగతి తెలిసింది. దీనిపై పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు. అయితే, దీనిపై రియల్ ఎస్టేట్ పరిశ్రమ నుంచి ప్రతికూలత ఎదురైంది. ముఖ్యంగా ఇది మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేక నిర్ణయంగా చాలామంది అభివర్ణించారు. పైగా ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడంతో రియల్ ఎస్టేట్ యజమానులు, ప్రత్యేకించి రెసిడెన్షియల్ ప్రాపర్టీ కలిగి ఉన్నవారికి పన్ను భారం బాగా పెరిగింది. అంతేకాకుండా ఈ నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ స్టాక్స్ నష్టాలబాటలో పయనించాయి. ఈ నేపథ్యంలో దీనికి కేంద్రం సవరణలు చేసింది.