Categories: TOP STORIES

అద్దె బాండ్లు.. ఎన్నారైలకు తప్పేను పాట్లు?

32 మిలియన్ల మంది ఎన్నారైల కమ్యూనిటీ మనదేశానికి విదేశీ ఆదాయం తీసుకొచ్చే పెద్ద వనరు. వారు తమ కుటుంబం కోసం, కొన్నిసార్లు స్వదేశంలో పెట్టుబడి కోసం దేశంలోకి నిధులు పంపిస్తారు. చారిత్రాత్మకంగా ఎన్నారైలు భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. దేశంలో ఇళ్లు కట్టుకోవాలనుకోవడం, జీవనశైలిని పెంపొందించుకోవడం, తమ పెట్టుబడికి తగిన రాబడి పొందాలనే ఉద్దేశాలు ఇందుకు కారణాలు. ఇదే క్రమంలో భారత రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి అద్దె ద్వారా ఆదాయాన్ని సంపాదించాలని భావించే ఎన్నారైలు కూడా కోకొల్లలుగా ఉంటారు.

అయితే, ఆయా ఇళ్ల నిర్వహణ, తగిన సమయానికి అద్దె వసూలు చేయడం, సదరు ఆస్తికి ఎలాంటి నష్టం కలుగకుండా చూసుకోవడం అనేది క్లిష్టమైన అంశాలు. పెట్టుబడిదారులు చాలా దూరంలో ఉంటారు కాబట్టి, ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చడం చాలా సందర్భాల్లో కష్టంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అవరోధాలను అధిగమించి అటు ఎన్నారైలు, ఇటు దేశంలోని నివాసితులు ప్రయోజనం పొందేందుకు కొత్తగా రెంటల్ బాండ్లు, మేనేజ్డ్ అకామిడేషన్ అనే రెండు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది పెట్టుబడిదారుల అద్దెను సేకరించే, వారి ఆస్తులను నిర్వహించే విధానాన్ని కూడా సులభతరం చేస్తుంది.

అద్దె బాండ్ అనేది య‌జ‌మాని, అద్దెదారు, హామీదారు మధ్య ఒప్పందం. య‌జ‌మాని భరించే నష్టాలను చక్కదిద్దడానికి ఇది సంస్థాగత హామీ. అపార్ట్ మెంట్ ను అద్దెకు ఇచ్చేటపుడు తరచుగా వినిపించే రెండు ప్రధాన అవరోధాలు.. బకాయిల వసూలు, ఆస్తిని సకాలంలో ఖాళీ చేయించలేకపోవడం. ఇదే అద్దెదారు వైపు నుంచి చూస్తే మూడు నుంచి 10 నెలల భారీ మొత్తాన్ని సమకూర్చాల్సి రావడం. అద్దెదారుల నుంచి ఉత్పన్నమయ్యే నష్టాలను పూడ్చుకోవడానికి య‌జ‌మాని అద్దెదారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. అయితే, ఇది చిన్న వేతన జీవులకు పెద్ద భారంగా మారుతుంది.

ఈ నేపథ్యంలో అద్దె బాండు అనేది ఈ సమ‌స్యను పరిష్కరిస్తుంది. ఇక్కడ అద్దె బాండు అనేది అద్దెదారు తరపున భూస్వామికి ష్యూరిటీ అందించే సంస్థ ఇమచ్చే పత్రం. అద్దెదారు నుంచి ఉత్పన్నమయ్యే నష్టాలను తాను భరిస్తానని రాసి ఇచ్చే ఒప్పందపత్రం అన్నమాట. సకాలంలో అద్దె చెల్లించడంలో వైఫల్యం, ఆస్తి నష్టం, లాక్ ఇన్ వ్యవధి ఉల్లంఘన, చెల్లించని యుటిలిటీ బిల్లుల వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

భారతదేశంలోని తమ ఆస్తులను నిర్వహించడానికి ఎన్నారైలుకు సహాయం చేయడమే కాకుండా దేశంలో అధిక స్థాయిలో ఉన్న ఆక్యుపై చేయని ఆస్తులను పరిష్కరించడానికి అద్దె బాండ్లు సహాయపడతాయి. మనదేశంలోని పట్టణ ప్రాంతాల్లో దాదాపు 11 మిలియన్లకు పైగా ఇళ్లు వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్నాయని అంచనా. రెంటల్ హౌసింగ్ విధానం లేకపోవడం, భూస్వాములకు అనుకూలంగా లేని ప్రస్తుత చట్టాలు, తక్కువ అద్దె రాబడి, సకాలంలో అద్దె, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించపులపై భూస్వామి, కౌలుదారు మధ్య విశ్వాసం లోపించడం వంటివి ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలో దేశంలో అద్దె గృహాలను ప్రోత్సహించడానికి అద్దె బాండ్లు సహాయపడతాయి. ముఖ్యంగా ఎన్నారైలకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

This website uses cookies.