- ఉలిక్కిపడుతున్న చిన్నారులు
- కంటిమీద కునుకులేని పెద్దలు
- ఐటీ ఉద్యోగులకు ఇబ్బందులు
- కేటీఆర్, సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు
- పటిష్ఠమైన నిబంధనల్ని ఏర్పాటు చేయాలి
హైదరాబాద్‌లో ఒకవైపు ప్రధానమంత్రి పర్యటనలో ఉండగా.. మరోవైపు నగర బిల్డర్లు బాంబుల మోత మోగిస్తున్నారు. ప్రధానంగా నివాస ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. గచ్చిబౌలి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్‌చెరు, బాచుపల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో అపార్టుమెంట్లను నిర్మించే బిల్డర్లు పోలీసుల్ని సైతం లెక్క చేయట్లేదు. స్థానికులెంత ప్రాధేయపడినా కనికరించకుండా బ్లాస్టింగులు చేస్తున్నారు. రాత్రిపూట బండరాళ్లను పగులగొడుతూ.. నానా రభస చేస్తున్నారు. వీరంతా ఎవరికి కావాల్సిన ఆమ్యామ్యాలు వారికి అందజేస్తూ.. అడ్డదారిలో పనులు సాగిస్తున్నారు. వీరిని కట్టడి చేయాలని ప్రజలు అధికారుల్ని కోరుతున్నా ఫలితం మాత్రం కనిపించట్లేదు. నివాస ప్రాంతాల్లో అపార్టుమెంట్లను కట్టే బిల్డర్ల కోసం కట్టుదిట్టమైన నిబంధనల్ని పొందుపర్చాలని ప్రజలు కోరుతున్నారు.
హైదరాబాద్‌లో కొత్త నిర్మాణాలు రావాల్సిందే. దీనికి ఎవరూ అడ్డు చెప్పరు. ఎందుకంటే, కొత్త అపార్టుమెంట్లు వస్తేనే ప్రజల సొంతింటి కల సాకారం అవుతుంది. కాకపోతే, వీటిని నిర్మించే క్రమంలో డెవలపర్లు నిబంధనల్ని పాటించాలి. ముఖ్యంగా, నివాసయోగ్య ప్రాంతాల్లో కట్టే బిల్డర్లు ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు. హైదరాబాద్‌లో బ్లాస్టింగ్ చేయాలంటే సైబరాబాద్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలి. సాధారణ స్థాయిలో అనుమతుల్ని తీసుకుంటున్న బిల్డర్లు.. భారీ స్థాయిలో బాంబుల్ని పేల్చుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటీవల మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ పక్కనే అపార్టుమెంట్ కడుతున్న ప్రైమార్క్ బిల్డర్స్.. మధ్యాహ్నం పూట బాంబుల మోత మోగిస్తున్నాడు. దాన్ని పక్కనే ఉన్న మరో సైటులో అయితే రాత్రింబవళ్లు పనుల్ని చేపడుతూ.. చిన్నారులు, స్కూలుకెళ్లే విద్యార్థులు, పెద్దలు, మహిళలు, అమెరికా మరియు ఐరోపా కాలానుగుణంగా పని చేసే ఐటీ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో వీరంతా కలిసి మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. అయినా, ఈ బిల్డర్లు రాత్రి పూట పనుల్ని నిలిపివేయట్లేదు. బాంబుల మోత మోగిస్తూనే ఉన్నారు.
* తెల్లాపూర్, కొల్లూరు, నార్సింగి, మణికొండ వంటి ప్రాంతాల్లోనూ కొందరు బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్కడి స్థానికులు మౌనంగానే ఈ బాధను అనుభవిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదనే కారణంతో వీరంతా భరిస్తున్నారు. 100కు డయల్ చేసినా ఫలితం ఉండట్లేదు. స్థానిక పెట్రోలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వృథాప్రయాసే అవుతోంది. కాబట్టి, ఇప్పటికైనా పోలీసులు బిల్డర్లను అదుపులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. రోజంతా పని చేసే తమకు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.