111 జీవో ప్రాంతాలపై సర్కార్ ఏం చేస్తోంది?
హైదరాబాద్ లో ఇల్లు ఇప్పుడే కొనుక్కోవాలా.. లేదంటే కాస్త ఆగాలా.. గ్రేటర్ సిటీలో గృహ కొనుగోలుదారుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. గత బీఆర్ఎస్ సర్కార్ త్రిపుల్ వన్ జీవోను ఎత్తేయడంతో శివారు ప్రాంతాల్లో మరింత చౌకగా ఇళ్లు లభిస్తాయన్న ఆశ చాలా మందిలో కలిగింది. కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవో విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందిగ్ధం నెలకొంది. అయితే రేవంత్ సర్కార్ 111 జీవో విషయంలో త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 111 జీవోపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏడాది క్రితం వరకు 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ బీఆర్ఎస్ ప్ఱభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో అథారిటీ ఏరియా నిబంధనల మేరకు ఇకపై 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లోను నిర్మాణాలు చేసుకోవచ్చని అప్పట్లో కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. దీంతో 111 జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. అయితే నిర్మాణాలకు సంబంధించిన విధి విధానాలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. దీంతో హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోవాలనుకునే వారంతా పునరాలోచనలో పడ్డారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా 111 జీవోపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దావోస్ పర్యటన నుంచి రాగానే 111 జీవో ప్రాంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకుంటారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
This website uses cookies.