ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుంది. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లు పడిన కష్టాలు తీరిపోనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ.2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిపోవడంతో ఇంధన రూపంలో వ్యయం తగ్గిపోనుంది.
ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు బస్సులు బయలుదేరే జేబీఎస్ నుంచి ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ ఆర్) మధ్య వరకు కంటోన్మెంట్ ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతంలో రహదారుల విస్తరణకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. కంటోన్మెంట్ ప్రాంతంలోని భూములు రక్షణ శాఖ పరిధిలోనివి కావడం, వాటి బదలాయింపునకు ఆ శాఖ సుముఖంగా లేకపోవడంతో ఈ రహదారుల విస్తరణపై గత ప్రభుత్వాలు పెద్దగా దృష్టిసారించలేదు. తమ రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రజల ప్రయోజనాలను విస్మరించిన గత ప్రభుత్వం గత దశాబ్దకాలంగా ఇంత కీలకమైన అంశాన్ని విస్మరించింది. 2019లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పలుమార్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో రక్షణ శాఖ స్టాండింగ్ సభ్యునిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ కమిటీ సమావేశాల్లోనూ కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విషయంలో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను లేవనెత్తేవారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఈ అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి అయిదో తేదీన స్వయంగా కలిసి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు తమకు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అంగీకరిస్తూ మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నడుంబిగించింది.
రాజీవ్ రహదారిపై కారిడార్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్,తూంకుంట మీదుగా శామీర్‌పేట్ సమీపంలోని ఓఆఆర్ ఆర్ జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 11.12 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్ వద్ద), అల్వాల్ వద్ద (0.310 కిలోమీటర్ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు.
* ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ప్రయోజనాలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ ఫర్ డే -పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్ ఆర్ జంక్షన్ సమీపంలో 35,825గా ఉంది. అసలైన ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు, ప్రయాణికులు హడలిపోతున్నారు. సమయం హరించుకుపోతోంది. ఇంధన రూపంలో వ్యయం పెరుగుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలిసిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బాధలు తొలగిపోతాయి.
* మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ.
* ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ.
* అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ.
* పియర్స్: 287
* అవసరమైన భూమి: 197.20 ఎకరాలు
* రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు
* ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు
* ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు
* ప్రాజెక్టుతో ప్రయోజనాలు:
* రాజీవ్ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు చెల్లు
* కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం
* ఇంధనం మిగులుతో వాహననదారులకు తగ్గనున్న వ్యయం
* నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ ఆర్ వరకు చేరుకునే అవకాశం
* రాజీవ్ రహదారిలోని జిల్లాలు: మేడ్చల్-మల్కాజిగిరి-సిద్దిపేట-కరీంనగర్-పెద్దపల్లి-మంచిర్యాల.
మంచిర్యాల తర్వాత కొమురం భీం జిల్లా ప్రజలు ఈ రహదారితో లబ్ధి పొందుతారు
This website uses cookies.