Categories: TOP STORIES

బీఆర్ఎస్ హ‌యంలో సాహితీ.. కాంగ్రెస్ పాల‌న‌లో భువ‌న‌తేజ‌?

* కొత్త ప్ర‌భుత్వం పట్టించుకోక‌పోతే
* సాహితీ త‌ర‌హా స్కామ్ అయ్యే డేంజ‌ర్‌
* ప్ర‌జ‌ల్నుంచి కోట్లు దండుకున్న భువ‌న‌తేజ‌
* గుట్టు ర‌ట్టు కావ‌డంతో మ‌ళ్లీ కొత్త అవ‌తారం
* న‌కిలీ రెరా నెంబ‌ర్‌తో ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపి
* ఇంకెంత‌మంది ప్ర‌జ‌లు మోస‌పోవాలి?
* చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే కొత్త ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ఠ‌

 

హైద‌రాబాద్‌లో కొంద‌రు రియ‌ల్ట‌ర్లు ఎంత‌కు బ‌రి తెగించారంటే.. త‌ప్పుడు రెరా నెంబ‌రుతో.. కొనుగోలుదారుల‌ను బోల్తా కొట్టిస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా టీఎస్ రెరా మొద్దు నిద్ర పోతుండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణమ‌ని ప‌లువురు బిల్డ‌ర్లు ఈ సంద‌ర్భంగా అంటున్నారు. ఒక‌వైపు కొనుగోలుదారులు మోస‌పోతున్నా.. ప్ర‌జ‌లు వ‌చ్చి రెరా కార్యాల‌యంలో ఫిర్యాదు చేస్తున్నా రెరా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని బాధితులు వాపోతున్నారు.

భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా అనే సంస్థ హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టుల‌ను ఆరంభించి.. ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపి పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి అటు పుర‌పాల‌క శాఖ అధికారుల‌కు ఇటు రెరా ఉన్న‌తాధికారుల‌కు తెలిసినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో ఈ సంస్థ ఎండీ చ‌క్కా వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యం ఏదోర‌కంగా టీఆర్ఎస్ పెద్ద‌ల్ని మేనేజ్ చేశాడు. అందుకే, ఎంత‌మంది బ‌య్య‌ర్లు వ‌చ్చి ఫిర్యాదు చేసినా.. టీఎస్ రెరా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు.

అస‌లీ విష‌యంలో వాస్త‌వం ఎంతుంది? ఈ భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా అనే సంస్థ ఎన్ని అపార్టుమెంట్ల‌ను ఆరంభించింది? ఎక్క‌డెక్క‌డ మొద‌లెట్టింది? అస‌లా స్థ‌లం ఆ కంపెనీదేనా? లేక డెవ‌ల‌ప్‌మెంట్ మీద తీసుకున్నారా? మ‌రి, ఆ స్థ‌ల‌య‌జ‌మానుల‌కు ఈ భువ‌న‌తేజ ప్ర‌మోట‌ర్ మ‌ధ్య స‌త్సంబంధాలు ఉన్నాయా? లేక బెడిసికొట్టాయా? అలాగైతే, అందులో అప్ప‌టికే ప్రీలాంచ్‌లో ఫ్లాట్లు కొన్న‌వారి ప‌రిస్థితి ఏమిటి? వారికి అపార్టుమెంట్లు క‌ట్ట‌టిస్తాడా? లేక నెత్తిమీద శ‌ఠ‌గోపం పెడ‌తాడా? మొత్తం ఎన్ని కోట్లు వ‌సూలు చేశాడు? ఇలాంటి విష‌యాల‌పై తెలంగాణ రెరా అథారిటీ విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

విచార‌ణ ఎందుకు చేయ‌ట్లేదు?

గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో నియ‌మితులైన ఈ అథారిటీ ఉన్న‌తాధికారులు ప్రీలాంచ్ వ్య‌వ‌హారాల్లో నిమ్మ‌కు నీరెత్త‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది ఇలాగే కొన‌సాగితే.. అతిత్వ‌ర‌లో ఈ భువ‌న‌తేజ మీద ప్ర‌జ‌లు కేసులు పెడితే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌రువు గంగ‌లో క‌లుస్తుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే, టీఎస్ రెరా అథారిటీ.. భువ‌న‌తేజ ఇన్‌ఫ్రాపై పూర్తి స్థాయి విచార‌ణ జ‌ర‌పాలి. త‌ప్పుడు రెరా నెంబ‌రుతో ప్ర‌జ‌ల్ని మోసం చేస్తుంటే.. ఈ సంస్థ ఎందుకు ఉన్న‌ట్లు?

గ‌తంలో ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపి పెట్టిన జ‌య‌త్రీ గ్రూప్ రెరా నెంబ‌రుతో ప్ర‌ణ‌వ రియ‌ల్ట‌ర్స్ పేరుతో ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను అమ్మేందుకు భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా చ‌క్కా వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యం స్కెచ్ వేశాడు. ఈ అంశం తెలిసినా రెరా అథారిటీ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని.. అస‌లీ అథారిటీ వ‌ల్ల క‌లుగుతున్న ఉప‌యోగమేమిటో అర్థం కావ‌ట్లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక నుంచి ఎలాంటి మోసాల‌కు పాల్ప‌డ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల్ని తీసుకోవాలి. ఇప్ప‌టికే మోస‌పూరితంగా ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసిన సొమ్మును వారికి వెన‌క్కి ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి.

 

This website uses cookies.