-
బాచుపల్లిలో ప్రహరీగోడ కూలి
ఏడుగురు కూలీల మృత్యువాత
-
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే
ప్రమాదానికి కారణమని ఆరోపణ
-
రైజ్ కన్ స్ట్రక్షన్స్ ఎండీ వెంకన్న అరవింద్ రెడ్డి అరెస్ట్
-
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు
-
బిల్డర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
-
నిర్మాణ సంఘాలూ నిబంధనల్ని రూపొందించాలి
రైజ్ డెవలపర్స్ ఎండీ.. వెంకన్న అరవింద్ రెడ్డి.. ముందు చూపు లేకపోవడం వల్లనో.. కాసుల్ని ఆదా చేసుకుందామనే కక్కుర్తి వల్లనో.. మరే ఇతర కారణమో తెలియదు కానీ.. ఏడుగురి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
తమ కుటుంబాలకు బంగారు భవిష్యత్తును అందించడానికి.. ఎక్కడి నుంచో పొట్టచేత బట్టుకుని.. బాచుపల్లికి విచ్చేసి.. ఎర్రటి ఎండల్ని సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నవారిలో కొందరు.. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యాన్ని బలయ్యారు. సరైన ప్రణాళికల్లేకుండా రైజ్ సంస్థ ఇంజినీర్లు ప్లాన్ చేసిన రిటైనింగ్ వాల్ కూలిపోయి.. సామాన్య ప్రజలు దుర్మరణం చెందారు. ఏడుగురు మరణానికి కారణమైన సంస్థ ఎండీ వెంకన్న అరవింద్ రెడ్డిని పోలీసులైతే అరెస్టు చేశారు. ఇతను తల పలుకుబడితో.. డబ్బులు ఖర్చు పెట్టయినా త్వరలో బెయిల్‌పై విడుదలౌతాడు. కానీ, గాలిలో కలిసిన ప్రాణాల్ని మళ్లీ తేగలడా? అందుకే, హైదరాబాద్‌లో అపార్టుమెంట్లు, బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్న బిల్డర్లు.. కాసులకు కక్కుర్తి పడకుండా.. భవన నిర్మాణ కార్మికుల భద్రత గురించి పటిష్ఠమైన చర్యల్ని తీసుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యల గురించి నిర్మాణ సంఘాలతా కలిసికట్టుగా చర్చించాలి. కొన్ని కీలకమైన నిర్ణయాల్ని తీసుకోవాలి.
బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో రైజ్ కన్ స్ట్రక్షన్స్ పేరుతో ఐదంతస్తుల అపార్ట్ మెంట్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం అపార్ట్ మెంట్ చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఆ గోడను ఆనుకుని ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లలో కూలీల కుటుంబాలు నివసిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆ గోడ కూలిపోయి రేకుల షెడ్లపై పడింది. దీంతో అందులో ఉన్న నాలుగేళ్ల చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గోడ కూలిపోయి రేకుల షెడ్లపై పడటాన్ని కొందరు ప్రత్యక్షంగా చూశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు తమను కాపాడాలంటూ చేసిన అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కానీ గోడ చాలా ఎత్తైనది కావడంతో శిథిలాలను వెంటనే తొలగించడం సాధ్యం కాలేదు. ఈలోగా ఏడుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఘటనకు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రైజ్ డెవలపర్స్ ఈ రిటైనింగ్ వాల్ ను తొలుత 15 అడుగుల ఎత్తున నిర్మించారని.. అనంతరం దానిని 30 అడుగులకు పెంచారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎత్తు పెంచినా మందం తక్కువగా ఉండటం.. ఆ ఎత్తుకు తగ్గ పునాది లేకపోవడంతో వర్షానికి కూలిపోయిందని అంటున్నారు. మరి, ఈ సంస్థకు చెందిన స్ట్రక్చరల్ ఇంజినీర్లు, సివిల్ ఇంజినీర్లు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యుడైన ఎండీకి చెందిన సంస్థ బిల్డింగ్ లైసెన్సును జీహెచ్ఎంసీ రద్దు చేయాలి. అదేవిధంగా, ఇందుకు బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే, ఇక నుంచి ప్రతి బిల్డర్ జాగ్రత్తగా నిర్మాణాలు చేపడతారని అంటున్నారు.