- ఆర్ హోమ్స్ పేరిట అక్రమ వసూళ్ల పర్వం
- సుడా, రెరా అనుమతి లేకుండా
- సిద్దిపేట్‌లో వాసవి హైట్స్ ఆరంభం
- రెరా అనుమతి లేకుండానే అమ్మకాలు
- చదరపు అడుక్కీ రూ.2199కి అమ్మకం
- బుకింగ్ ఎమౌంట్: లక్ష రూపాయలు
- మొదటి రోజే 100 ఫ్లాట్ల అమ్మకం
- 45 రోజుల్లోపు 45 కోట్ల వసూళ్లకు స్కెచ్!
తెలంగాణ రాష్ట్రంలో మంత్రి హరీష్ రావు అంటే తెలియనవారు ఎవరైనా ఉంటారా? ఆయన ప్రజల మనిషి. ఎవరికే సమస్య వచ్చినా ఇట్టే వాలిపోయే తత్వం. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటారు. ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి పరిష్కరించే వ్యక్తి. మరి, ఆయన ఇలాకాలో రియల్ ఎస్టేట్ దొంగల ముఠా ప్రవేశించింది. సిద్దిపేట్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, తెలంగాణ రెరా అథారిటీ అనుమతి తీసుకోకుండా ఆర్‌జే గ్రూప్.. సిద్దిపేట్‌లో వాసవి హైట్స్ అనే కొత్త అపార్టుమెంట్‌ని ఆరంభించింది. దీనికి ఆర్‌జే గ్రూపు పేరును వాడకుండా.. ఆర్ హోమ్స్ నిర్మిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటనల్ని గుప్పిస్తోంది.
ఆర్ హోమ్స్ అనే సంస్థ ప్రీలాంచ్ ఆఫర్‌లో భాగంగా.. వంద శాతం సొమ్ము కట్టేవారికి.. చదరపు అడుక్కీ రూ.22 లక్షలకే ఫ్లాట్ ఇస్తానని ప్రకటించింది. ప్రాజెక్టు లాంచ్ అని చెప్పి బయ్యర్లను ఆకర్షించేందుకు జబర్దస్త్ టీముతో హడావిడి చేసింది. 3 ఎకరాల్లో 260 ఫ్లాట్లను కడతామని చెబుతూ.. మొదటి రోజే దాదాపు వంద దాకా ఫ్లాట్లను బుక్ చేసినట్లు సమాచారం. బుకింగ్ ఎమౌంట్ సుమారు ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయల చొప్పున సుమారు కోటీ రూపాయలు వసూలు చేశారని తెలిసింది. మరో పది రోజుల్లో వీరి నుంచి ఎంతలేదన్నా మిగతా రూ.4 లక్షల చొప్పున తీసుకుంటారు. అంటే, రెండు వారాల వ్యవధిలో ఎంతలేదన్నా రూ.5 కోట్ల దాకా అక్రమంగా వసూలు చేస్తారు. మరో ఇరవై నుంచి ముప్పయ్ రోజుల్లో మిగతా సొమ్ము, అనగా రూ. 17 లక్షల చొప్పున వసూలు చేస్తారు. దాదాపు నెల నుంచి నలభై ఐదు రోజుల్లో ఎంతలేదన్నా రూ.22 కోట్ల దాకా అక్రమంగా కొనుగోలుదారుల్నుంచి వసూలు చేస్తారన్నమాట. రియల్టర్లు, ఏజెంట్లు , జబర్దస్ట్ టీము చేసే హంగామా చూసి.. ఇంకా కొంతమందిని ఈ సంస్థ బుట్టలో వేసే ప్రయత్నం చేయడం ఖాయమని చెప్పొచ్చు. మిగతా వంద ఫ్లాట్లనూ ఈలోపు ఇక్కడి ఏజెంట్లు అమ్మేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే రెండు వందల ఫ్లాట్ల మీద సుమారు రూ. 45 కోట్ల దాకా అక్రమంగా వసూలు చేస్తున్నారన్నమాట.