poulomi avante poulomi avante

నిర్మాణ‌ సంఘాలు.. అండ‌ర్ టేకింగ్ ఇవ్వాలి

  • తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి
  • రియ‌ల్ రంగంలో పార‌ద‌ర్శ‌కత ఏర్ప‌డాలంటే..
  • స‌భ్యుల్నుంచి సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ తీసుకోవాలి
  • ఆకాశ‌హర్మ్యాల‌పై ఫీజులు పెంచాలి
  • హైట్ వెళ్లే కొద్దీ.. ఓపెన్ స్పేస్ పెర‌గాలి
  • జీవో నెం.50ని త‌ప్ప‌కుండా ర‌ద్దు చేయాలి
  • విజిలెన్స్, ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటు

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: తెలంగాణ రాష్ట్రంలో యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాలు రియ‌ల్ రంగాన్ని కుదిపేస్తున్నాయి. కృత్రిమంగా పెరిగిన భూముల ధ‌ర‌లు.. అధిక‌మైన నిర్మాణ వ్య‌యం.. ఇత‌ర రాష్ట్రాల్నుంచి వ‌స్తున్న పెట్టుబ‌డులు త‌దిత‌ర అంశాల వ‌ల్ల హైద‌రాబాద్‌లో ఒక్క‌సారిగా బూమ్ పెరిగింది. ఇదే స‌మ‌యంలో.. కొంద‌రిలో దురాశ కూడా పెరిగింది. అమాయ‌క కొనుగోలుదారుల్నుంచి కోట్లు కొల్ల‌గొడుతున్నారు. పెట్టుబ‌డిదారుల్నుంచి భారీ స్థాయిలో సొమ్మును స‌మీక‌రిస్తున్నారు. ఇలాంటి వికృత పోక‌డ‌ల్ని అరిక‌ట్టేందుకు నిర్మాణ సంఘాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. పుర‌పాల‌క శాఖ కొన్ని క‌ఠిన‌మైన నిర్ణ‌యాల్ని తీసుకోవాలి. లేక‌పోతే, ఈ అక్ర‌మ తంతు వ‌ల్ల రానున్న రోజుల్లో తెలంగాణ నిర్మాణ రంగం నిర్వీర్య‌మ‌య్యే ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. నొయిడా, గుర్గావ్ త‌ర‌హాలో మ‌న డెవ‌ల‌ప‌ర్ల మీద పోలీసు కేసులు పెరుగుతాయి. కొంద‌రు జైల్లో ఊచ‌లు లెక్క పెట్టాల్సిన దుస్థితి దాపురిస్తుంది. మ‌రి, ఇవ‌న్నీ రాకూడ‌దంటే ఏం చేయాలి?

నిర్మాణ రంగంలో పెద్ద‌గా అనుభ‌వం లేనివారంతా అపార్టుమెంట్ల‌ను క‌ట్ట‌డానికి ముందుకొచ్చారు. స్థ‌లానికి, అనుమ‌తుల‌కు, నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే సొమ్మును స‌మీక‌రించేందుకు యూడీఎస్‌, ప్రీలాంచ్‌లో ఫ్లాట్లు అమ్మ‌డం ఆరంభించారు. రేటు త‌క్కువ అనేస‌రికి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, పెట్టుబ‌డిదారులు వేలంవెర్రిగా కొన‌డాన్ని మొద‌లెట్టారు. ఈ విధానం రెరా నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని తెలిసినా.. కొన్ని సంఘాలు చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. పుర‌పాల‌క‌, రెరా విభాగాలూ ప‌ట్టించుకోవ‌డం మానేశాయి. ఫ‌లితంగా, రియ‌ల్ రంగంలో సునామీలో అక్ర‌మార్కులు రంగ‌ప్ర‌వేశం చేశారు. అంద‌రూ క‌లిసి సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల క‌ష్టార్జితాన్ని కొల్ల‌గొట్ట‌డం ఆరంభించారు. రేటు త‌క్కువ అంటూ ప్ర‌చారం చేస్తూ.. సొమ్మును దోచుకోవ‌టం ప్రారంభించారు. అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ఈ వికృత పోక‌డ‌ను అరిక‌ట్టేందుకు నిర్మాణ సంఘాలు న‌డుం బిగించాయి. గ‌త వారం అన్నీ క‌లిసిక‌ట్టుగా యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పాయి. అయితే, ఈ సంఘాలు మ‌రొక ప‌ని చేయాలి. త‌మ సంఘంలోని ప్ర‌తి స‌భ్యుడి నుంచి సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ తీసుకోవాలి. ఆత‌ర్వాత ఇవ‌న్నీ క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వానికి అండ‌ర్ టేకింగ్ ఇవ్వాలి. అప్పుడే, అక్ర‌మ వ్యాపారాల్ని అరిక‌ట్టేందుకు ఆయా సంఘాలెంత నిజాయితీగా ఉన్నాయో ప్ర‌భుత్వానికీ అర్థ‌మ‌వుతుంది.

ప్ర‌భుత్వం ఆంక్ష‌ల్ని విధించాలి.

వెయ్యి చ‌ద‌ర‌పు మీట‌ర్లు (సుమారు 1200 గ‌జాలు) కంటే త‌క్కువ స్థ‌లాన్ని యూడీఎస్ కింద రిజిస్ట్రేష‌న్ చేయ‌కూడ‌దు. డెవ‌ల‌ప్‌మెంట్ అగ్రిమెంట్ కూడా చేయడానికి వీల్లేకుండా నిబంధ‌న‌లు మార్చాలి. కొందరు తెలివైన బిల్డ‌ర్లు ఏం చేస్తున్నారంటే.. కొనుగోలుదారుల‌కు యూడీఎస్ కింద కొంత స్థ‌లాన్ని రిజిస్ట్రేష‌న్ చేసిన వెంట‌నే డెవ‌ల‌ప్‌మెంట్ అగ్రిమెంట్ కూడా చేసేస్తున్నారు. ఎందుకంటే, ఏ ఒక్క‌రైనా డెవల‌ప్‌మెంట్ అగ్రిమెంట్ చేయ‌క‌పోతే, ఆ ప్రాజెక్టుకు ముందుకెళ్ల‌దు. ఆయా కొనుగోలుదారుడు చేజార‌కుండా ఇలాంటి ముంద‌స్తు జాగ్ర‌త్త‌ను తీసుకుంటారు. ఇలాంటి వాటిని నియంత్రించాలంటే రిజిస్ట్రేష‌న్ మ‌రియు డెవ‌ల‌ప్‌మెంట్ అగ్రిమెంట్ మ‌ధ్య‌లో ప‌ది రోజుల్నుంచి రెండు వారాల్లోపు వ్య‌వ‌ధిని పెట్టాలి.

జీవో 50ని ర‌ద్దు చేయాలి!


గ‌తంలో ఆకాశ‌హర్మ్యాలు నిర్మించే క్ర‌మంలో.. ఎంత ఎత్తుకు వెళితే అంత సెట్ బ్యాక్ వ‌దిలేవారు. కానీ, జీవో నెం.50 అమ‌ల్లోకి వ‌చ్చాక‌.. సెట్ బ్యాక్ వ‌ద‌లాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఫ‌లితంగా, బిల్ట‌ప్ ఏరియా ఎక్కువ‌గా రావ‌డం ఆరంభ‌మైంది. దీంతో చాలామంది స్థ‌ల‌య‌జ‌మానులు గొంతెమ్మ కోరిక‌లు కోర‌డం మొద‌లెట్టారు. ఫ‌లితంగా 15, 20 అంత‌స్తులు క‌ట్టే బిల్డ‌ర్లు 30 అంత‌స్తులు, 25 నుంచి 30 అంత‌స్తులు క‌ట్టే డెవ‌ల‌ప‌ర్లు 40 అంత‌స్తులు క‌ట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధిక బిల్ట‌ప్ ఏరియా రావ‌డంతో దాన్ని ప్ర‌భావం స్థ‌లాల ధ‌రల మీద ప‌డింది. అందుకే, ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని ఔట‌ర్ రింగ్ రోడ్డుకు స‌మీపంలోని ప్రాంతాల భూముల రేట్లు క్ర‌మ‌క్ర‌మంగా పెర‌గ‌డం ఆరంభ‌మైంది. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏమిటంటే.. జీవో నెం.50ని నిర్మోహ‌మాటంగా ర‌ద్దు చేయాలి.

ఓపెన్ స్పేసులు పెర‌గాలి


ఓపెన్ స్పేసెస్ పెంచేలా నిబంధ‌న‌ను తేవాలి. ఐదు ఎక‌రాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆకాశ‌హ‌ర్మ్యాలు క‌డితే ప‌ది శాతం ఓపెన్ స్పేస్ అద‌నంగా వ‌ద‌లాల‌నే నిబంధ‌న‌ను తేవాలి. ఏడు ఎక‌రాల్లో క‌డితే ప‌దిహేను శాతం, 10 ఎక‌రాల కంటే ఎక్కువ‌గా క‌డితే 20 శాతం, అంత‌కుమించిన విస్తీర్ణంలో ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌డితే 25 శాతం ఓపెన్ స్పేసెస్ వ‌ద‌లాల‌నే నిబంధ‌న‌ల్ని పొందుప‌ర్చాలి. 50 ఎక‌రాల లేఅవుట్ వేసేట‌ప్పుడు 20 ఎక‌రాలు ఓపెన్ స్పేస్ కోసం వ‌దిలేస్తాం. అదేవిధంగా, ఆ స్థ‌లంలో పెద్ద ప్లాట్ల‌లో అపార్టుమెంట్ల‌లో క‌ట్టేట‌ప్పుడు సెట్ బ్యాక్ వ‌దిలేస్తాం. ఓపెన్ స్పేస్ కు స్థ‌లాన్ని కేటాయిస్తాం. అదే విధంగా, ఆకాశ‌హ‌ర్మ్యాల్లోనూ ఓపెన్ స్పేస్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకోవాలి. దీని వ‌ల్ల స‌మాజానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. కాంక్రీటు జంగిల్లా మారుతున్న త‌రుణంలో ఆకాశ‌హ‌ర్మ్యాల్లో లంగ్ స్పేసెస్ పెంచాలి. గెస్టు పార్కింగులు, విజిట‌ర్స్ పార్కింగులకు స్థానం క‌ల్పించాలి. ట‌వ‌ర్ల మధ్య ఖాళీ స్థ‌లాన్ని వ‌దిలేయాలి. హైట్ సెట్ బ్యాక్ పై నియంత్ర‌ణ విధిస్తే.. ఆటోమెటిగ్గా వికృత పోక‌డ‌ల‌కు అడ్డు ప‌డుతుంది.

ఆకాశ‌హ‌ర్మ్యాల ఫీజుల్ని పెంచాలి..


తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏక‌కాలంలో ప‌ద‌హారు జీవోల‌ను మంజూరు చేసి రియ‌ల్ రంగానికి పూర్తి బాస‌ట‌గా నిలిచారు. అనుమ‌తుల ఫీజులు, ఇంపాక్టు ఫీజును త‌గ్గించాలి. ఇంపాక్టు ఫీజును వాయిదాల్లో క‌ట్టేందుకు మ‌రింత‌ వెసులుబాటు క‌ల్పించారు. అయితే, ఫీజులు త‌క్కువ‌గా ఉన్నాయ‌నే ఆస‌రాగా చేసుకుని కొంద‌రు బిల్డ‌ర్లు పెట్రేగిపోతున్నారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు 30 నుంచి 40 అంత‌స్తుల అపార్టుమెంట్ల‌ను నిర్మించే క్ర‌మంలో.. యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాలు జ‌రుపుతున్నారు. దీన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం కొంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి. 25 కంటే ఎక్కువ అంత‌స్తుల్ని క‌ట్టేవారి నుంచి అధిక ఫీజును వ‌సూలు చేయాలి. ఇంపాక్టు ఫీజును పెంచాలి. వాయిదాల్లో ఫీజుల్ని క‌ట్టే వెసులుబాటును తొల‌గించాలి. దీంతో, అవ‌స‌ర‌మైతే త‌ప్ప ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌ట్టేందుకు డెవ‌ల‌ప‌ర్లు ముందుకు రారు.

 

సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ తీసుకోవాలి!


యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాల్ని త‌గ్గించాలంటే.. ప్ర‌తి నిర్మాణ సంఘం త‌మ స‌భ్యుల నుంచి సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ తీసుకోవాలి. తాము అక్ర‌మ రీతిలో అమ్మ‌కాలు జ‌ర‌ప‌డం లేద‌ని రాసివ్వాలి. ఎవ‌రైనా చేస్తున్నారా? లేదా? అని ప‌ర్య‌వేక్షించ‌డానికి ప్ర‌త్యేకంగా టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ప్ర‌తి నిర్మాణ సంఘం ఏర్పాటు చేసుకోవాలి. ధృవీక‌ర‌ణ ప‌త్రం మీద సంత‌కం పెట్టిన త‌ర్వాత కూడా ఎవ‌రైనా అక్ర‌మ రీతిలో అమ్మ‌కాలు జ‌రుపుతుంటే.. ఆయా బిల్డ‌రుకు షోకాజ్ నోటీసును జారీ చేయాలి. అత‌ని నుంచి స‌రైన రీతిలో స్పంద‌న రాక‌పోతే, స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి. అధికారికంగా ప‌త్రికాముఖంగా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయాలి. ఈ ర‌కంగా క‌ట్టుదిట్టంగా నిర్మాణ సంఘాలు వ్య‌వ‌హ‌రిస్తే త‌ప్ప యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాల్ని గ‌ట్టిగా నిరోధించ‌లేం. త‌మ స‌భ్యులెవ‌రూ యూడీఎస్‌, ప్రీలాంచ్ అమ్మ‌కాలు జ‌ర‌ప‌డం లేద‌ని నిర్మాణ సంఘాల‌న్నీ విడివిడిగా ప్ర‌భుత్వానికి అండ‌ర్ టేకింగ్ ఇవ్వాలి. తెలంగాణ‌లోని అన్ని నిర్మాణ సంఘాలు త‌మ స‌భ్యుల్ని.. యూడీఎస్‌, ప్రీలాంచులు చేయ‌కుండా నియంత్రించాలి. ఇలా చేస్తేనే నిర్మాణ రంగంలోని స‌భ్యులంద‌రూ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తారు.

యూడీఎస్‌, ప్రీలాంచుల్ని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంఘాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా కృషి చేయాలి. ఇందుకోసం హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో.. ప్ర‌త్యేకంగా వర్క్ షాపులు, సెమినార్లను నిర్వ‌హించాలి. యూడీఎస్‌, ప్రీలాంచుల వ‌ల్ల జ‌రుగుతున్న అన‌ర్థం గురించి చ‌ర్చించాలి. ఈ విధానాన్ని అరిక‌ట్టేందుకు.. అర్బ‌న్ ప్లాన‌ర్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, స‌బ్ రిజిస్ట్రార్లు, ఆర్కిటెక్టులు, డెవ‌ల‌ప‌ర్లు క‌లిసి మేధోమ‌ధ‌నం జ‌ర‌పాలి. ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తానంటే సీఎం కేసీఆర్ కానీ పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ కానీ అడ్డు చెప్పే అవ‌కాశ‌మే లేదు. పైగా, నిర్మాణ రంగ‌మంతా క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో అభివృద్ధి కావాల‌న్న‌దే వారి తాప‌త్ర‌యం. కాబ‌ట్టి, నిర్మాణ సంఘాలు స‌మాజానికి ఉప‌యుక్త‌మైన ఇలాంటి మంచి ప‌నికి శ్రీకారం చుట్టాలి.

పుర‌పాల‌క శాఖ‌, రెరా అథారిటీలు క‌లిసి.. యూడీఎస్‌, ప్రీలాంచ్ ప‌థ‌కంలో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను అమ్మే బిల్డ‌ర్ల‌ను దారిలోకి తెచ్చేందుకు ప్ర‌త్యేకంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అక్ర‌మ నిర్మాణాల్ని నిరోధించేందుకు బెంగ‌ళూరులో పోలీసులు సుమోటోగా కేసును స్వీక‌రిస్తారు. ఇక్క‌డా అలాంటి నిబంధ‌న‌ను ప్ర‌వేశ‌పెట్టాలి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే బిల్డ‌ర్ల‌పై పోలీసు కేసు పెట్టాలి. తెలంగాణ రెరా అథారిటీలో కొత్త సిబ్బందిని నియ‌మించాలి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles