విల్లా ప్రాజెక్టులతో భవిష్య రియల్టర్స్,
ఎన్ఎస్ఏ అవెన్యూ చీటింగ్
కొనుగోలుదారులను రూ.15 కోట్ల మేర మోసం చేసిన కేసులో హైదరాబాద్ కు చెందిన రెండు రియల్టీ సంస్థలపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దూలపల్లికి చెందిన సురభి అశోక్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు భవిష్య రియల్టర్స్, ఎన్ఎస్ఏ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. 2023 జనవరిలో భవిష్య రియల్టర్స్ కు చెందిన పి.బాబూరావు, జె.శేఖర్ రావు, జి.వెంకట రమణారావు, ఎన్ఎస్ఏ అవెన్యూ డైరెక్టర్ కోనేరు వెంకట వినయ్ కలసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరులోని 17 ఎకరాల్లో డూప్లెక్స్ విల్లాలు నిర్మించడానికి కొత్త వెంచర్ వేసినట్టు ప్రకటించారు. అశోక్ రావుతోపాటు ఆయన స్నేహితులు 8 మంది అందులో విల్లాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచారు.
సంప్రదింపులు తర్వాత ఒక్కో విల్లాను రూ.1.7 కోట్లకు విక్రయించడానికి బిల్డర్లు ఒప్పందం చేసుకున్నారు. అందరూ అడ్వాన్సుగా రూ.లక్ష చొప్పున చెల్లించారు. 450 చదరపు గజాల స్థలంలో 4,250 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు సంవత్సరాల్లో విల్లా నిర్మించి ఇవ్వడానికి అగ్రిమెంట్ కుదిరింది. విడతలవారీగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అందరూ పూర్తి మొత్తం చెల్లించారు. సైట్ కు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని అడిగినప్పుడల్లా.. ధరణి వెబ్ సైట్ ఓపెన్ కావడంలేదంటూ సాకులు చెప్పి తప్పించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతనెలలో అశోక్ రావు తన స్నేహితులతో కలిసి సైట్ సందర్శనకు వెళ్లగా.. ఆ భూమి బిల్డర్లకు చెందినది కాదని తేలింది. దీంతో మీసేవ కేంద్రంలో ఆ సర్వే నెంబర్ల భూమి గురించి వాకబు చేయగా.. అది నిషేధిత జాబితాలో ఉన్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో బాబూరావు, ఇతర బిల్డర్లపై బాధితులు ఫిర్యాదు చేశారు.