- బ్లాక్ స్టోన్, హీరానందిని గ్రూప్ జాయింట్ వెంచర్
- లాజిస్టిక్స్, వేర్ హౌస్ రంగాలపై దృష్టి
ప్రముఖ రియాల్టీ సంస్థ హీరానందిని గ్రూప్, అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ కలిసి భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ రెండు సంస్థలూ కలిసి గ్రీన్ బేస్ అనే జాయింట్ వెంచర్ కింద భారత్ లోని పలు కీలక నగరాల్లో దాదాపు రూ.3వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నాయి. పారిశ్రామిక రంగంతోపాటు లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ పార్కుల అభివృద్ధిలో ఈ నిధులను వెచ్చించబోతున్నాయి. ‘భారత్ లో అత్యధిక ఆర్థిక కార్యకలాపాలు ఉండటంతోపాటు దేశంలో లాజిస్టిక్స్ రంగంలో డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం’ అని గ్రీన్ బేస్ సీఈఓ ఎన్. శ్రీధర్ తెలిపారు. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ (రీట్) ద్వారా పారిశ్రామిక, లాజిస్టిక్స్ పోర్టిఫోలియోలో సైతం పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ‘భారత్ ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు పెడుతోంది. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు సైతం అందుకు దోహదం చేసేవిగా ఉన్నాయి. దేశం అంతర్జాతీయ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా రూపొందుతున్న తరుణంలో లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ రంగాలు కీలకం కాబోతున్నాయి’ అని హీరా నందిని మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ హీరానందిని అభిప్రాయపడ్డారు.