డెవలపర్లకు మహారెరా స్పష్టీకరణ
ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునే మహారాష్ట్ర రెరా మరో చక్కని నిర్ణయం తీసుకుంది. డెవలపర్లు, ఏజెంట్లు తమ ప్రాజెక్టు ప్రకటనలపై రెరా రిజిస్ట్రేషన్ నంబర్ తోపాటు రెరా వెబ్ పేజీకి లింక్ చేసే క్యూఆర్ కోడ్ ను స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని స్పష్టంచేసింది. ఈ ఆదేశాలు పాటించని డెవలపర్లకు రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కొనుగోలుదారులకు పారదర్శకంగా, సమగ్ర సమచారాన్ని ఇవ్వాలనే తలంపుతో ప్రాజెక్టు ప్రకటనలపై రెరా నంబర్ తోపాటు, క్యూఆర్ కోడ్ ప్రచురించాలని 2023 ఆగస్టులో మహారెరా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డెవలపర్లకు ఆదేశాలిచ్చింది. క్యూఆర్ కోడ్ ను ప్రకటనలో కుడివైపున ఎగువ భాగంలోనే ఉంచాలని స్పష్టంచేసింది.
అయితే, చాలామంది డెవలపర్లు క్యూఆర్ కోడ్ తోపాటు రెరా రిజిస్ట్రేషన్ నంబర్ ను ప్రముఖంగా ప్రదర్శించడంలేదని.. కనీకనిపించని విధంగా పేలవమైన రంగులు, చిన్న అక్షరాలతో ప్రచురిస్తున్నారని గుర్తించింది. దీంతో ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. “ప్రకటనలు లేదా ప్రమోషన్‌లలో మహారేరా రిజిస్ట్రేషన్ నంబర్, వెబ్‌సైట్ చిరునామా ఫాంట్ పరిమాణం.. ప్రాజెక్ట్ సంప్రదింపు వివరాలు, చిరునామా కోసం ఉపయోగించిన ఫాంట్ పరిమాణానికి సమానంగా లేదా పెద్దదిగా ఉండాలి.
ALSO READ: సొంతింటి కోసం ఎప్పుడు సన్నద్దం కావాలా?
అయితే, సంప్రదింపు వివరాలు వేరే ఫాంట్‌లో పేర్కొంటే, Maharera registration number మహారేరా రిజిస్ట్రేషన్ నంబర్.. సంప్రదింపు వివరాలు, చిరునామా కోసం ఉపయోగించిన అతిపెద్ద ఫాంట్ కంటే సమానంగా లేదా పెద్దదిగా ఉండాలి” అని రెరా తాజా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. చిన్న ఫాంట్ లు, లేత రంగులను నివారించాలని సూచించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం, 2016లోని సెక్షన్లు 63 మరియు 65 ప్రకారం రూ.50,000 వరకు జరిమానా విధించవచ్చని పేర్కొంది. డెవలపర్లు, ఏజెంట్లు వీటిని తమ ప్రకటనల్లో సరిచేయడానికి 10 రోజుల సమయం ఇస్తున్నట్టు తెలిపింది.