- 2025 మొదటి మూడు నెలల్లో 2.4 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్
- 34 శాతం వాటాతో హైదరాబాద్ టాప్
- కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక వెల్లడి
దేశంలో రిటైల్ లీజింగ్ అదరగొట్టింది. దేశవ్యాప్తంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రిటైల్ రంగం 2.4 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన ఇది 55 శాతం అధికం కావడం విశేషం. గతేడాది ఇదే వ్యవధిలో 1.56 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ లీజింగ్ జరిగింది. వార్షిక ప్రాతిపదికన లీజింగ్ 55 శాతం అధికం కాగా, అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం అధికంగా లీజింగ్ కార్యకలాపాలు జరిగాయి. ఈ మేరకు వివరాలను కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ తాజా నివేదిక వెల్లడించింది. ఇక మొత్తం లీజింగ్ లో హైదరాబాద్ 34% (0.8 మిలియన్ చదరపు అడుగులు)తో ముందుంది. ఇది వార్షిక ప్రాతిపదికన 106 శాతం అధికం కావడం విశేషం. హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ వంటి ప్రముఖ హై స్ట్రీట్‌లతో పాటు కొత్తపేట, సికింద్రాబాద్, బోడుప్పల్, కొంపల్లి వంటి కొన్ని కొత్త హై స్ట్రీట్‌లు కూడా లీజింగ్‌కు దోహదపడ్డాయి.
మొత్తం రిటైల్ లీజింగ్ కార్యకలాపాలలో హైదరాబాద్, ముంబై మరియు ఢిల్లీలు కలిసి 74 శాతం వాటాతో ఆదిపత్యం కొనసాగిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలలో కొత్త సరఫరా ప్రారంభం కారణంగా మాల్స్, హై స్ట్రీట్ లు రెండూ ఈ వృద్ధికి దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది. నగరాలవారీగా చూస్తే.. మొత్తం లీజింగ్ పరిమాణంలో 24% (0.58 మిలియన్ చదరపు అడుగులు) వాటాతో ముంబై రెండో స్థానంలో ఉంది. వార్షిక ప్రాతిపదిక ఇది 259% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఢిల్లీ కూడా గణనీయమైన పెరుగుదల చూసింది. మొత్తం లీజింగ్ వాటాలో 17% (0.41 మిలియన్ చదరపు అడుగులు) సొంతం చేసుకుంది. వార్షికంగా ఇది 57 శాతం అధికం. అదే సమయంలో బెంగళూరు 0.19 మిలియన్ చదరపు అడుగులు, చెన్నై 0.19 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ స్థిరంగా ఉన్నాయి. లీజింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రధాన వీధులు ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాయి.
ALSO READ:రియాల్టీ నేల చూపులు!
హై స్ట్రీట్ లు లీజింగ్ ల్యాండ్‌స్కేప్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయని, మొత్తం లీజింగ్ పరిమాణంలో 2/3 వంతు 1.69 మిలియన్ చదరపు అడుగులతో ఉన్నాయని.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రీమియం హై స్ట్రీట్ లొకేషన్‌లు రిటైలర్ల నుంచి ఆసక్తిని పెంచాయని నివేదిక పేర్కొంది. ఈ త్రైమాసికంలో మాల్ లీజింగ్ 0.72 మిలియన్ చదరపు అడుగుల వద్ద ఉంది. ముఖ్యంగా ముంబై 0.31 మిలియన్ చదరపు అడుగులతో మాల్స్ లీజింగ్ లో 44% అత్యధిక లీజు వాటా ఉంది. ఇక 2025 చివరి నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో దాదాపు 6.4 మిలియన్ చదరపు అడుగుల కొత్త మాల్ సరఫరాతో మాల్ లీజింగ్ కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు.