కొనుగోలు చేసిన ఉదయ్ కోటక్ కుటుంబం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఖరీదైన రియల్ లావాదేవీ జరిగింది. వర్లీలోని 22 ఫ్లాట్లు ఉన్న ఓ భవనం రూ.400 కోట్లకు అమ్ముడైంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, ఆయన కుటుంబం ఈ భవనాన్ని అంత మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. చదరపు అడుగుకు గరిష్టంగా రూ.2.89 లక్షల ధర పలికినట్టయింది. 22 ఫ్లాట్లు ఉన్న ఈ భవనంలో10 సీ వ్యూ అపార్ట్ మెంట్లు ఉన్నాయి. కేవలం ఈ 10 అపార్ట్ మెంట్లకే దాదాపు రూ.200 కోట్లు వెచ్చించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో కోటక్ కుటుంబం 12 అపార్ట్ మెంట్లను రూ.202 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.
తాజాగా 22 ఫ్లాట్లను రూ.400 కోట్లకు కొని తన పోర్ట్ ఫోలియోను విస్తరించుకుంది. ఈ లావాదేవీ రియల్ ఎస్టేట్ ధరలలో కొత్త బెంచ్‌మార్క్ ను సెట్ చేయడమే కాకుండా, కుటుంబం మొత్తం భవనాన్ని కొనుగోలు చేయడంతో ఒక ప్రత్యేకమైన ఒప్పందంగా నిలుస్తుంది. మొత్తం హౌసింగ్ సొసైటీని పూర్తిగా కొనుగోలు చేయడం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చాలా అరుదైన విషయం అని స్థానిక ఏజెంట్లు చెబుతున్నారు.