poulomi avante poulomi avante

సొంతిల్లు కొనుగోలుకు ఇదే సరైన సమయమా?

సొంతిల్లు.. ఇది ప్రతి ఒక్కరి కల. అయితే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నవారిలో ఎన్నో సందేహాలు. రియల్ ఎస్టేట్ కొంతమేర నెమ్మదించిన ఇటువంటి సమయంలో ఇంటిని ఇప్పుడు కొనడం మంచిదేనా? లేదంటే కొన్నాళ్లు వేచిచూడాలా? ముందు ముందు ధరలు పెరుగుతాయా? లేక తగ్గుతాయా? ఇలా ఇంటి కొనుగోలుదారుల్లో ఎన్నో ప్రశ్నలు. అయితే ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేయాలంటున్నారు రియల్ రంగ నిపుణులు. ఎందుకంటే నిర్మాణరంగంలో ఇళ్ల ధరలు పెరగడమే కానీ తగ్గడం ఉండదనీ , కానీ ఇప్పుడు మార్కెట్ చతికిలపడిపోవడంతో ఇంటి కొనుగోలుదారులకు కొంత మేర తక్కువ ధరలకే ఇళ్లు లభిస్తాయని చెబుతున్నారు.

సొంతిల్లు అందరి కల. ఎవరి బడ్జెట్ కు అనుగునంగా వారు ఎక్కడో ఓ చోట ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. అయితే ఇంటి కొనుగోలు అంశంలో ఆర్ధిక అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఎప్పటికప్పుడు వాయిదా వేసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఇంటి కొనుగోలు విషయంలో ఆలస్యం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు రియల్ రంగ నిపుణులు. ఎందుకంటే ఇంటి ధరలు ఎప్పటికప్పుడు పెరగడమే కాని తగ్గడం ఉండదు. అయితే హైదరాబాద్ లో ఇప్పుడు నిర్మాణరంగం కాస్త నెమ్మదించింది. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం చతికిలపడిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇళ్ల నిర్మాణాలు తగ్గడం నుంచి మొదలు అమ్మకాలు కూడా ఇంతకు ముందులా లేవని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభావం రియల్ ఎస్టేట్ పై స్పష్టంగా కనిపిస్తోంది. గత యేడాదిన్నర కాలంగా హైదరాబాద్ లో నిర్మాణాల వేగం తగ్గింది. కొత్త ప్రాజెక్టుల లాంచిగ్ లు అంతంతమాత్రంగానే ఉంది. ఇందుకు అనుగునంగా హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాల్లో కొంతమేర స్తబ్ధత నెలకొంది.

ఇల్లు కొనాలా? కొన్నాళ్లు ఆగాలా?
గత యేడాది నుంచి ఇళ్ల అమ్మకాలు అనుకున్న మేర జరగడం లేదని రియల్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందన్నది అంచనా వేయలేకపోతున్నారు. దీంతో హైదరాబాద్ లో ఇల్లు, ఇంటి స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్న వారు కొంత ఆలోచనల్లో పడ్డారు. కొన్నాళ్లు ఆగాక స్థిరాస్తి కొనుగోలు చేస్తే మంచిదని చాలా మంది బయ్యర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి ధరలు తగ్గకపోయినా.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు తగ్గవచ్చన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. అందుకే కొన్నాళ్లు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు కొనుగోలుదారులు. ఇలాంటి ప్రచారంతో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న మరికొంత మంది సైతం ఆలోచనల్లో పడ్డారు. దీంతో ఇటువంటి సమయంలో ఇంటిని కొనుగోలు చేయాలా? వద్దా? అన్న సందేహాం చాలా మందిలో కలుగుతోంది. అయితే ఇలాంటి సమయంలోనే ఇంటిని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

బిల్డర్ తో బేరమాడే సమయం ఇదే
సొంతిల్లు కొనుగోలు చేసేవారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. నిర్మాణరంగంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధతను అవకాశంగా తీసుకోవాలని చెబుతున్నారు. మార్కెట్ లో ఇళ్ల ధరలు కాస్త అందుబాటులోనే ఉన్నాయి. అందులోను దేశంలోకెల్లా హైదరాబాద్ లో ఇంటి సగటు చదరపు అడుగు ధర తక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు మార్కెట్ స్లోగా ఉన్న క్రమంలో ఇల్లు కొనేవారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బిల్డర్ తో సంప్రదింపులు జరిపితే కొంత మేర ధర తగ్గించే అవకాశం ఉంటుంది. నిజంగా ఇల్లు కొనే ఉద్దేశ్యం ఉన్న బయ్యర్లకు చదరపు గజానికి కనీసం 100 రూపాయల నుంచి 300 రపాయల వరకు ధరలు తగ్గిస్తున్నారు బిల్డర్లు. అందుకే నిర్మాణదారులతో బేరాలాడితే ఇప్పుడు సరసమైన ధరకు లభించే అవకాశం ఉంది.

నచ్చిన ఇల్లు కావాలంటే ఇదే రైట్ టైమ్
అంతే కాదు హైదరాబాద్ లో ప్రస్తుతం వందలకొద్దీ భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మాణం పూర్తై అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు కొనాలనుకుంటున్న ప్రాజెక్టులో మనకు నచ్చిన ఫ్లాట్ ను ఎంచుకునే ఛాన్స్ ఈ టైంలోనే దొరుకుతుందంటున్నారు రియల్ రంగ నిపుణులు. ఎందుకంటే అమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు నచ్చిన ఫ్లోర్ లో, నచ్చిన దిశగా ఇల్లు దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు అమ్మకాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి నిర్మాణ ప్రాజెక్టులో మనకు నచ్చిన ఇంటిని ఎంపిక చేసుకునే ఛాన్స్ లభిస్తుంది. అంతే కాకుండా మన కుటుంబ అవసరాలకు సరిపోయే విస్తీర్ణంలో ఫ్లాట్ కావాలన్నా ఇదే రైట్ టైమ్ అంటున్నారు. ఇక వాస్తు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నా ఇప్పుడు ఇల్లు కొనడమే కరెక్ట్ అని చెబుతున్నారు.

డబ్బు చెల్లింపులుకు కొంత సమయం
రియల్ ఎస్టేట్ రంగంలో కొద్ది మంది ఇన్వెస్టర్లు మినహా.. ఎక్కువ మంది తమ సొంత అవసరాల కోసం ఇంటిని కొనుగోలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఉండటానికి ఇల్లు, విల్లాలు, ఫ్లాట్, భవిష్యత్తు అవసరాల కోసం వెంచర్లలో స్థలాలు కొంటుంటారు. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు పెట్టుబడులు పెడుతుంటారు. అలాంటప్పుడు మార్కెట్ తో సంబంధం లేకుండా నిజానికి స్తబ్దుగా ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే మంచిదని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. రాత్రికి రాత్రే ధరలు పెంచే పరిస్థితులు ఉండవని, చెప్పిన ధర కంటే కాస్త తగ్గించడానికి, డబ్బు చెల్లింపులకు కొంత గడువు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉందంటే మున్ముందు ఒక్కసారిగా పెరగడానికి అవకాశం ఉంటుందనీ.. అలాంటి పరిస్థితులు రాకముందే స్థిరాస్తి కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు.

సిద్ధంగా పలు ప్రాజెక్టుల్లో కొనడం వల్ల ఎన్నో లాభాలు
మార్కెట్లో పెద్ద ఎత్తున అపార్ట్ మెంట్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సిద్దమైన ప్రాజెక్టులతో పాటు ఈ ఏడాది ఆఖరు, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న నివాసాలు ఉన్నాయి. వీటి ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ స్లోగా ఉన్న ఇటువంటి సమయంలో కొందరు బిల్డర్లు ప్కత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న ప్రాజెక్టుల్లో ఇంటి కొనుగొలు వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. వెంటనే అద్దె ఇల్లు ఖాళీ చేసి సొంతింటిలోకి వెళ్లిపోవడం ద్వార అద్దె భారం నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాకుండా రెడీ టు అక్యుపై ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేయడం ద్వార అదనపు ఈఎంఐ భారం తప్పుతుంది. దీంతో పాటు రెడీగా ఉన్న ఇంటి కొనుగోలు సమయంలో ప్రాజెక్టు నాణ్యత సైతం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

భవిష్యత్తులో పెరగడమే తప్ప తగ్గడం ఉండదు..
రాబోయే రోజుల్లో గృహ నిర్మాణానికి, కార్యాలయాలకు, అతిథ్య రంగం, రిటైల్ రంగాల్లోని నిర్మాణాలకు, వీటికి అవసరమైన భూములకు డిమాండ్ పెరుగుతుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. జనాభా పెరగడం, నగరానికి వలసలు, ఆదాయాలు పెరగడం వంటివన్నీ కూడా ఇళ్ల ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఇల్లు కొనాలా? వద్దా అనే సందేహం నుంచి బయటకు వచ్చి ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇంటిని కొనేటప్పుడు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో లేకుండా అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకోవాలని గుర్తుంచుకోవాలి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles