హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్లు వేయడం సాధ్యమేనని ఆర్వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వాటిని వేసుకోవడం వల్ల ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. సిడ్నీలో జరుగుతున్న క్రెడాయ్ నాట్ కాన్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడారు. సిడ్నీలో ట్రాఫిక్ వ్యవస్థ చాలా బావుందని వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ చిన్నచిన్న రోడ్లలో కూడా ప్రణాళికాబద్ధంగా సిగ్నల్స్, వన్ వేలు పెట్టడం వల్ల ట్రాఫిక్ ఫ్లోకి ఎలాంటి అడ్డంకులూ లేవు. వాహనాలన్నీ సాఫీగా సాగిపోతున్నాయి.
ఇక్కడ పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలకు కూడా లిమిటెడ్ సెట్ బ్యాక్స్ ఇస్తున్నారు. రోడ్లకే ప్రధాన ప్రాధాన్యం ఇచ్చి సెట్ బ్యాక్స్ ను తక్కువ చేయడం బావుంది. మన హైదరాబాద్ లో కూడా భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సెట్ బ్యాక్స్ సరిగా ఇవ్వని పరిస్థితి ఉంది. సిడ్నీలో డెవలప్ మెంట్ చాలా బావుంది. ఇక్కడ వాళ్లకు సరిపడినంత బడ్జెట్ ఉంటుంది. మన దగ్గర బడ్జెట్ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మెట్రో చాలా బావుంది. పైనే కాకుండా అండర్ గ్రౌండ్ లో కూడా ప్రజారవాణా వ్యవస్థ చక్కగా ఉంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మీద ఇక్కడ బాగా దృష్టి కేంద్రీకరించారు. మన హైదరాబాద్ లో కూడా దీనిపై దృష్టి పెడితే బావుంటుంది. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కావు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం మెట్రో, ఓఆర్ఆర్ వంటివి అభివృద్ధి చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలి.
ముఖ్యంగా మెట్రో, బస్ సర్వీసులను బాగా విస్తరించాలి. టన్నెల్ వ్యవస్థ అనేది మన దగ్గర చేసినట్టే ఇక్కడ కూడా చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్లు అనేది వంద శాతం సాధ్యమే. రోడ్ల కింద, పెద్ద పెద్ద భవనాలు లేని చోట్ల భూగర్భంలో అలైన్ మెంట్ చేసుకుంటే టన్నెల్ రోడ్లు వేయడం సాధ్యమవుతంది. సిటీ మధ్య నుంచి ఎనిమిది వైపులా ఈ టన్నెల్ రోడ్లు వేసి, ఇంటర్ కనెక్షన్ చేసుకుంటే అందరూ పబ్లిక్ ట్రాన్స్ పోర్టునే వినియోగిస్తారు’ అని తెలిపారు.
This website uses cookies.