కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడి కోలుకున్న తర్వాత నటుడు సైఫ్ అలీఖాన్ ఖతార్ లో మరో ఇల్లు కొన్నారు. దోహాలోని ది పెర్ల్ లో ఉన్న ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను ఇటీవల ఓ విలాసవంతమైన ప్రాపర్టీని కొనుగోలు చేసినట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు. అది చాలా సురక్షితం అని, అక్కడ ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైఫ్.. ఖతార్ లో కొన్న ఇంటి వివరాలు వెల్లడించారు. దృక్పథాలు, ఆహారం, జీవనశైలి, జీవన వేగం వంటి అంశాలు అక్కడ ప్రాపర్టీ కొనడానికి తననే ప్రేరేపించాయన్నారు. భద్రత, అందంలో భారత్ తో సామీప్యంగా ఖతార్ ఉంటుందని.. తన కుటుంబానికి అది సరైన గమ్యస్థానం అని వ్యాఖ్యానించారు. అక్కడ ఉండటం ఎంతో గొప్పగా అనిపించిందని పేర్కొన్నారు.
‘నేను కొన్న హాలిడే హోమ్ లేదా సెకండ్ హోమ్ గురించి ఆలోచించండి. అది చాలా దూరంలో ఏమీ లేదు.. అక్కడకు సులభంగానే చేరుకోవవచ్చు. అది చాలా సురక్షితమైన ప్రదేశం కావడం మరో అతిముఖ్యమైన విషయం. అక్కడ ఉండటం చాలా బాగుంది. ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన చాలా అందమైన, విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. అది మనం నివసించడానికి నిజంగా అందమైన ప్రదేశం’ అని తెలిపారు. ఖతార్ లోని ప్రాపర్టీ ఇంటి నుంచి దూరంగా ఉన్న ఇల్లు అని అభివర్ణించారు. ‘నేను అక్కడికి ఏదో షూటింగ్ కోసం వెళ్లాను.
ఆ ప్రాపర్టీలో బస చేశాను. అద్భుతంగా ఉందనిపించింది. అక్కడ నాకు నిజంగా నచ్చిన గోప్యత, విలాసం రెండూ ఉన్నాయి. అక్షరాలా అది ఇంటి నుంచి దూరంగా ఉన్న ఇల్లులా అనిపించింది. అది ఎంతో ప్రశాంతంగా, ఏకాంతంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని అక్కడకు తీసుకెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. కాగా, సైఫ్ కు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాపర్టీలున్నాయి. ప్రస్తుతం సైఫ్.. తన భార్య-నటి కరీనా కపూర్, కుమారులు తైమూర్, జెహ్‌తో బాంద్రా అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్నారు. అతనికి పూర్వీకుల పటౌడీ ప్యాలెస్ కూడా ఉంది.