2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భలే జోరు
హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2023 క్యూ4 (అక్టోబర్-డిసెంబర్)లో 16,808 లావాదేవీల ద్వారా రూ.9,497 కోట్ల మేర అమ్మకాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్క్వేర్ యార్డ్స్ సంస్థ వెల్లడించింది. ఈ త్రైమాసికంలో అపర్ణా కన్ స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ అమ్మకాల విలువ, లావాదేవీల పరంగా టాప్ లో నిలిచింది. మొత్తం 621 యూనిట్ల విక్రయం ద్వారా రూ.510 కోట్ల మేర అమ్మకాలు జరిపింది.
‘దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ప్రాపర్టీ ధరలు అందుబాటులో ఉండటం కలిసొచ్చింది. పెట్టుబడిదారులు, ఇళ్ల కొనుగోలుదారులకు లాభదాయకమైన ధర వద్ద మార్కెట్లో ప్రవేశించడానికి అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు అనుకూలమైన విధానాలు, అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ, స్థిరమైన ఆస్తి ధరలు హైదరాబాద్ మార్కెట్ ను అద్భుతంగా ముందుకు నడిపించాయి’ అని స్క్వేర్ యార్డ్స్ ప్రిన్సిపల్ పార్ట్ నర్ దేబయన్ భట్టాచార్య పేర్కొన్నారు.
హైదరాబాద్ ఐటీ పరిశ్రమ.. రియల్ బూమ్ కు ప్రధాన కారణం. ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటి అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఉండటం రియల్ రంగానికి మంచి ఊతమిచ్చింది. ఐటీ నిపుణులు నగరానికి వెల్లువెత్తడంతో ఇక్కడ నాణ్యత కలిగిన ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక 2023 క్యూ4లో అత్యధిక లావాదేవీలు వెస్ట్ జోన్ లోనే జరిగాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ వంటి ప్రాంతాలు కలిగిన ఐటీ కారిడార్ లో 8058 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇక్కడ రూ.5,383 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. సెంట్రల్ హైదరాబాద్ లో 1323 యూనిట్ల ద్వారా రూ.1017 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈస్ట్ జోన్ లో కూడా విక్రయాలు పెరిగాయి. అక్కడ 2536 యూనిట్ల ద్వారా రూ.965 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. నార్త్ జోన్ లో 2179 యూనిట్లతో రూ.898 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా.. సౌత్ జోన్ లో 1607 లావాదేవీలతో రూ.735 కోట్ల మేర అమ్మకాలు సాగాయి. సికింద్రాబాద్ లో 1104 లావాదేవీలతో రూ.497 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.
హౌసింగ్ డిమాండ్ కు కేంద్ర బిందువుగా హైదరాబాద్..
‘ఇటీవల కాలంలో హౌసింగ్ డిమాండ్ కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా నిలిచింది. ఇక్కడి సహేతుకమైన ధరలు పెట్టుబడిదారులకు, కొత్తగా ఇళ్లు కొనాలనుకునేవారికి లాభదాయకమైన ఒప్పందాలకు అవకాశమిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగావకాశాల పెరుగుదల, ముఖ్యంగా హైదరాబాద్ లోకి ఐటీ, బీఎఫ్ఎస్ఐ కంపెనీల రాకతో రియల్ ఎస్టేట్ రంగం బలోపేతమైంది. ప్రస్తుత డిమాండ్, వృద్ధి నేపథ్యంలో హైదరాబాద్ రియల్ రంగం మరింత మంచి పనితీరు కనబరిచి ముందుకు సాగుతుంది’ అని పౌలోమి ఎస్టేట్స్ ఎండీ ప్రశాంత్ రావు పేర్కొన్నారు.