క్యూ2లో రియల్ సత్తా ఇదీ
టాప్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్
దేశంలోని 26 ప్రధాన లిస్టెడ్ రియల్ సంస్థలు రెండో త్రైమాసికంలో రూ.35వేల కోట్ల ప్రాపర్టీలను విక్రయించాయి. ఇందులో గోద్రేజ్ ప్రాపర్టీస్ టాప్ లో నిలిచింది. ఈ అమ్మకాల్లో ఎక్కువ భాగం రెసిడెన్షియల్ సెగ్మెంట్ ప్రీ సేల్ బుకింగ్స్ కి సంబంధించినవే కావడం గమనార్హం. విక్రయాల బుకింగ్‌ల పరంగా, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 5,198 కోట్ల ప్రీ-సేల్స్ తో గోద్రెజ్ ప్రాపర్టీస్ అతిపెద్ద లిస్టెడ్ ప్లేయర్‌గా అవతరించింది. లోధా బ్రాండ్‌తో ప్రాపర్టీలు విక్రయిస్తున్న ముంబైకి చెందిన మాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ రూ.4,290 కోట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీకి చెందిన మాక్స్ ఎస్టేట్స్ రూ. 4,100 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించగా, బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ. 4,022.6 కోట్ల విక్రయాల బుకింగ్‌లతో ఉంది. ఢిల్లీకి చెందిన సిగ్నేచర్ గ్లోబల్ సంస్థ రెండో త్రైమాసికంలో రూ. 2,780 కోట్ల విక్రయాలు నమోదు చేసింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని అతిపెద్ద రియాల్టీ సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఈ సమయంలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదీ ప్రారంభించకపోవడంతో అమ్మకాల బుకింగ్‌లు రూ.692 కోట్లకు పడిపోయాయి. ఇతర ప్రధాన సంస్థలను పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ. 1,821 కోట్ల అమ్మకాలు జరపగా.. ముంబైకి చెందిన ఒబెరాయ్ రియల్టీ రూ. 1,442.46 కోట్ల ప్రీ-సేల్స్ చేసింది. ముంబైకి చెందిన ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ రూ.1,412 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించింది. బెంగళూరుకు చెందిన పుర్వాంకర లిమిటెడ్ రూ. 1,331 కోట్లు, శోభా లిమిటెడ్ రూ. 1,178.5 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. ఢిల్లీకి చెందిన టార్క్ లిమిటెడ్ రూ.1,012 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది. పుణేకు చెందిన కోల్టే-పాటిల్ డెవలపర్స్ లిమిటెడ్ రూ.770 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించగా, ముంబైకి చెందిన కీస్టోన్ రియల్టర్స్ (రుస్టోంజీ బ్రాండ్) రూ.700 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది.
ఢిల్లీకి చెందిన ఆషియానా హౌసింగ్ లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 673 కోట్ల విక్రయాలను నమోదు చేయగా, బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 568 కోట్ల ప్రీ-సేల్స్ నమోదు చేసింది.