తోటోడు తొడ కోసుకుంటే.. నేను మెడ కోసుకుంటా.. అనే బిల్డర్లు హైదరాబాద్ రియల్ రంగంలో ఎక్కువయ్యారు. పక్క బిల్డర్ ముప్పయ్ అంతస్తులు కడుతుంటే.. అతనికంటే నేనేం తక్కువంటూ నలభై అంతస్తుల్ని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే వీళ్లు బిల్డర్లు కాదు.. ప్రీలాంచ్ స్కామ్‌స్టర్లు.. మహానగరంలోకి అడుగుపెట్టిన మహామాయగాళ్లు.. ప్రజల కష్టార్జితాన్ని దోచుకోవడానికి వచ్చిన మోసగాళ్లు.. సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలల ఆశల్ని ఆవిరి చేస్తున్న రియల్ దొంగలు.
పైగా, ఈ బిల్డర్లు సొంతంగా స్థలం కొనుక్కుని కడుతున్నారా అంటే అదీ లేదు. ఎక్కడో ఒక చోట స్థలం దొరికితే చాలు..డెవలప్‌మెంటుకు తీసుకున్న వెంటనే ప్రీలాంచ్‌లో అమ్మకానికి పెట్టేస్తున్నారు. అందులో కడతారా? లేదా? అనేది తర్వాతి సంగతి. ముందుగా మార్కెట్లో అయితే ప్రీలాంచ్ ఇన్వెస్టర్లకు గాలెం వేస్తున్నారు. ఎంత సొమ్ము చేతికొస్తే అంత దోచేసుకుంటున్నారు. ఆతర్వాత ఆయా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించటం ఈ తరహా బిల్డర్లకు వెన్నెతో పెట్టిన విద్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే.. ఆయా స్థలయజమానులు మోసపూరిత సంస్థల వలలో ఎలా పడుతున్నారో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఎందుకంటే, ఒక ల్యాండ్‌లో ప్రాజెక్టును మొదలెట్టిన తర్వాత అది పూర్తి కాకపోతే.. బిల్డర్‌తో పాటు ల్యాండ్‌లార్డ్ పరువు గంగలో కలుస్తుంది. ఈ లాజిక్‌ను వీరు ఎలా మిస్ అవుతున్నారో తెలియట్లేదు.
కూకట్‌పల్లిలో హానర్ హోమ్స్ సంస్థ గతంలో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఇటీవల కాలంలో రెరా అనుమతితో హానర్ సిగ్నిటీస్ అనే ప్రాజెక్టును అట్టహాసంగా ఆరంభించింది. రెండేళ్ల క్రితం ప్రీలాంచ్లో చదరపు అడుక్కీ రూ.4000కి అటుఇటుగా విక్రయించిన ఈ సంస్థే ఇటీవల రెరా అనుమతితో అధికారికంగా ప్రాజెక్టును మొదలెట్టింది. ఇందులో ప్రస్తుతం చదరపు అడుక్కీ రూ.7749 చొప్పున అమ్ముతోంది. అల్ట్రా ప్రీమియం లగ్జరీ అపార్టుమెంట్లను రూ.8,249కి విక్రయిస్తోంది. ఈ ప్రాజెక్టును వచ్చిన ఆదరణను చూసో లేక కొత్తగా డెవలప్‌మెంట్‌కి స్థలం లభించిందో తెలియదు కానీ.. ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా అనే సంస్థ కూకట్‌పల్లి ప్రీలాంచ్ ప్రాజెక్టును మొదలెట్టింది. ఐడీఎల్ రోడ్డులో ఇరవై ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ముప్పయ్ అంతస్తుల ప్రాజెక్టును ఆరంభిస్తుందట. ఇందులో మొత్తం పదమూడు టవర్లు వస్తాయట. ఇంకా రెరా అనుమతి రాని ఈ ప్రాజెక్టులో చదరపు అడుక్కీ రూ.4200 చొప్పున ఫ్లాట్లను విక్రయిస్తోంది. ఇందులో ఫ్లాట్ ఆరంభ సైజు సుమారు 1600 చదరపు అడుగులుగా నిర్ణయించారట. దీని ప్రకారం.. రూ.67 లక్షలకే ఫ్లాట్ లభిస్తుంది. అదే 2100 చదరపు అడుగుల ఫ్లాట్ రూ.88.20 లక్షలే అంటూ ప్రీలాంచ్లో విక్రయిస్తోంది.
ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా అనే సంస్థ నానక్‌రాంగూడ చౌరస్తాలో ఐటీ, కమర్షియల్ భవనమైన ఎస్ఎఎస్ ఐ టవర్ భవనాన్ని కొన్నేళ్ల నుంచి నిర్మిస్తోంది. 11 ఎకరాల్లో 3 టవర్లలో లక్షా ఇరవై వేల చదరపు అడుగుల్లో కడుతోం…ది. 36 అంతస్తుల ఎత్తులో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు నిన్నామొన్నటివరకూ ఎంబసీ పేరిట బోర్డులను ఏర్పాటు చేసింది. గతేడాది ఏప్రిల్లో ఎంబసీ, ఎస్ఏఎస్ మధ్య ఒప్పందం కుదిరిందనే వార్తలు ప్రసారమాధ్యమాల్లో ప్రత్యేకంగా కనిపించాయి. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ప్రస్తుతం సైటు వద్ద ఎంబసీ బోర్డులు కనిపించట్లేదు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు. మార్కెట్లో ఆరా తీస్తే ఈ ప్రాజెక్టు గురించి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి.
కోకాపేట్‌లో జి+57 అంతస్తుల ఎత్తులో సాస్ క్రౌన్ అనే ప్రాజెక్టును 4.5 ఎకరాల్లో ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా సంస్థ నిర్మిస్తోంది. 5 టవర్లు.. 57 అంతస్తుల ఎత్తులో 250 ఫ్లాట్లను కడుతోంది. కొన్నేళ్ల నుంచి సా…గుతోన్న నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ తెలియదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో 7.36 ఎకరాల్లో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టును మొదలెట్టింది. నివాస సముదాయాలైతే జి+52 అంతస్తుల ఎత్తులో రెండు టవర్లను కడుతోంది. ఎకరం స్థలంలో జి ప్లస్ 27 అంతస్తుల ఎత్తులో డైమండ్ టవర్స్ అనే వాణిజ్య సముదాయాన్ని కడుతోంది.
ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా అనే సంస్థ హైదరాబాద్ రియల్ రంగంలోకి ప్రీలాంచుల్లో ఆరంభమైన రోజుల్లోనే మొదలైంది. తొలుత ఈ సంస్థ నానక్‌రాంగూడ చౌరస్తాలో వాణిజ్య, ఐటీ సముదాయాన్ని చిన్న చిన్న ఇన్వెస్టర్లతో పాటు బడాబాబులకు విక్రయించింది. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కానే కాలేదు. తర్వాతి రోజుల్లో కోకాపేట్‌లో 57 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని మొదలెట్టింది. ఇందులోనూ తొలుత ప్రీలాంచ్‌లో విక్రయాల్ని జరిపింది. తర్వాత డైమండ్ టవర్స్ ఆరంభించింది. ఏదీఏమైనా సాస్ ఇన్‌ఫ్రా అనే సంస్థ ఇంతవరకూ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదనే విషయాన్ని మర్చిపోవద్దు. కోకాపేట్‌లో 57 అంతస్తుల ఆకాశహర్మ్యమైనా.. నానక్ రాంగూడలో సాస్ ఐ టవర్ అయినా.. కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైనా ఇంతవరకూ పూర్తి కాలేదు. కాబట్టి, ఈ సంస్థ కూకట్‌పల్లిలో కొత్త ప్రీలాంచ్ నాటకం మొదలెట్టింది కాబట్టి.. ఇందులో ఎవరైనా పెట్టుబడి పెడితే ఆయా సొమ్ముతో పాత ప్రాజెక్టులకు వినియోగిస్తుంది తప్ప కొత్త ప్రాజెక్టు కోసం వినియోగించదని పెట్టుబడిదారులు గుర్తించాలి. ఆయా రెండు ప్రాజెక్టుల్ని పూర్తి చేసి.. మళ్లీ మరొక చోట స్థలం తీసుకుని.. అందులో ప్రీలాంచ్ ను ఆరంభించి.. ఆయా సొమ్ముతో కూకట్‌పల్లి ప్రాజెక్టు కోసం వినియోగించే అవకాశముంది. కాబట్టి, తెలివైన ఇన్వెస్టర్లు ఈ వాస్తవాలన్నీ పరిశీలించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద మొదలెట్టిన ఆరంభించిన ప్రీలాంచ్‌లో ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టండి. ప్రీలాంచ్‌లో కొంటే తక్కువ రేటుకే వస్తుంది. కాకపోతే, ఆ ప్రాజెక్టు ఆరంభమయ్యే పూర్తవుతుందనే గ్యారెంటీ ఎక్కడుంది?
This website uses cookies.