లక్షలు కట్టమన్నాడు.. ప్రతినెలా వడ్డీ ఇస్తలేడు!
లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు
రెరా గడువు పూర్తయినా.. పూర్తి కాని నిర్మాణం
షాద్‌నగర్‌లోనూ సరికొత్త ప్రీలాంచ్ మోసం
రెరాకు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్
ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్త!
బిల్డింగులు కట్టడమేమైనా బ్రహ్మ విద్యా..! అయినా, బిల్డర్లకు స్థలమెందుకు ఇవ్వాలి? వారినెందుకు కోటీశ్వరుల్ని చేయాలి? అదేదో నేనే కడితే పోలా? ఇంజినీర్లను పెట్టుకుంటే వాళ్లే కట్టిపెడతారు. ఆ లాభాలేవో మనమే ఎంజాయ్ చేయొచ్చు కదా..*
సరిగ్గా ఇలాగే అనుకున్నారో లేదో తెలియదు కానీ.. కరోనా తర్వాత కొందరు ల్యాండ్‌లార్డ్స్ డెవలపర్లుగా అవతారమెత్తారు. మల్టీప్లెక్సులు కడతాం.. షాపింగ్ మాళ్లు కడతామంటూ ప్రచారాన్ని మొదలెట్టారు. ఇరవై ఐదు లక్షలు కడితే నెలకు రూ.18,750 అద్దె చెల్లిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. తొమ్మిది శాతం చొప్పున వడ్డీ గిట్టుబాటు అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నిజమేనని నమ్మి కొందరు అమాయక అత్యాశ కొనుగోలుదారులు.. అందులో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడేమో లబోదిబోమంటున్నారు. రెరా ప్రకారం గడువు పూర్తయినా
నార్సింగిలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్సు పూర్తి కాలేదు. బిల్డర్‌ను కలుద్దామంటే మధ్యవర్తులు కలవనివ్వరు. ఇక లాభం లేదనుకుని కొందరు ఇన్వెస్టర్లు కలిసి రెరాకు ఫిర్యాదు చేశారు. అయినా, ఎప్పటిలాగే రెరా అథారిటీ పెద్దగా స్పందించట్లేదు. ఈ డెవలపర్ మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమించట్లేదు. సాక్ష్యాధారాలన్నీ ఉన్నా.. అతని మీద ఎలాంటి చర్యల్ని తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ బిల్డరేమో ప్రతి నగరంలోనూ ప్రీలాంచ్ స్కీమును ప్రకటిస్తూ.. కోట్ల రూపాయల్ని దండుకుంటున్నాడు. తాజాగా షాద్‌నగర్‌లోనూ ఇలాంటి దుకాణమే తెరిచారు.
షాద్‌నగర్ సెంట్రల్ అంటూ అందులో సిక్స్ స్క్రీన్ సూపర్ లగ్జరీ ఆల్ రిక్లయినర్ సెన్సేషన్ మల్టీప్లెక్స్ కడతామంటూ ప్రీలాంచ్ ఆఫర్‌ను ప్రకటించిందీ సంస్థ. సుమారు రెండు ఎకరాల్లో జి ప్లస్ 5 అంతస్తులో షాపింగ్ మాల్ కమ్ మల్టీప్లెక్స్ కడతామని ప్రచారం చేస్తోంది. ఇందులో కొత్త ప్రీలాంచ్ స్కీమును ప్రకటించింది. వంద చదరపు అడుగుల స్థలాన్ని ఎనిమిది లక్షలు పెట్టి కొంటే.. నెలకు ఆరు వేలు అద్దె కూడా చెల్లిస్తానంటూ సామాన్య మదుపరుల్ని బుట్టలో వేసుకుంటోంది. తొలుత 10శాతం సొమ్ము, హెచ్ఎండీఏ అనుమతి వచ్చాక రూ.6.40 లక్షలు.. రెరా వచ్చాక మిగతా పది శాతం కట్టమంటూ బ్రహ్మాండమైన ఆఫర్‌ను ప్రకటించింది. అసలు రెరా రాకముందు అమ్మకాలే జరపొద్దని చట్టం చెబుతుంటే.. చట్టానికి అతీతుడిగా భావిస్తున్నట్లు ఉన్నాడీ సంస్థ యజమాని. మరి, అతన్ని భవిష్యత్తులో ఇంకక్కడా ఇలాంటి ప్రాజెక్టుల్ని కట్టకుండా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అసలీ షాపింగ్ మాల్, మల్టీప్లెక్సులో అద్దెలనే స్కీమును టీఎస్ రెరా పూర్తిగా రద్దు చేయాలి.
This website uses cookies.