2023-24 ఆర్థిక సర్వే వెల్లడి
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీలు (రెరా) ఇప్పటివరకు కొనుగోలుదారులకు సంబంధించి దాదాపు 1.25 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాయి. ఈ విషయాన్ని 2023-24 ఆర్థిక సర్వే వెల్లడించింది. నాగాలాండ్ మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెరాల్లో ఈ ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. 2024 జూలై ఒకటో తేదీ నాటికి 1,30,186 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రెరాలో నమోదు కాగా, 88,461 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదు చేసుకున్నారు. ‘వివాదాలను త్వరితగిన పరిష్కరించే వ్యవస్థను రెరా కల్పిస్తోంది.
2024 జూలై ఒకటో తేదీకి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,24,947 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి’ అని సర్వే తెలిపింది. రెరా చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో అగ్రిమెంట్ టు సేల్ తప్పనిసరి. అలాగే లేఔట్ లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే.. మూడింట రెండొంతుల మంది అలాటీలు లేదా కొనుగోలుదారుల అంగీకారం కూడా అవసరం. రిఫండ్, పరిహారం, జరిమానాల వంటి విషయంలోనూ నిర్దేశిత నిబంధనలు ఉన్నాయి. రెరా అమల్లోకి రాకముందు కొనుగోలుదారుల నుంచి బిల్డర్లపై చాలా ఫిర్యాదులు ఉండేవి. వీటిని పరిష్కరించేందుకు రెరా చర్యలు తీసుకుంది.