రష్యా టెన్నిస్ దిగ్గజం మరియా షరపోవా, ఫార్ములా వన్ మాజీ చాంపియన్ మైకేల్ షూమాకర్ లతోపాటు మరో 11 మందిపై గుర్గావ్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్, క్రిమినల్ కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియల్ టెక్ డెవలప్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గుర్గావ్ లోని సెక్టార్ 73లో షరపోవా పేరుతో ఓ ప్రాజెక్టు ప్రారంభించిందని షఫాలీ తెలిపారు. అందులో షూమాకర్‌పేరుతో ఉన్న టవర్ లో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నట్టు వివరించారు.
ఇందుకోసం రూ.80 లక్షలు చెల్లించానని, 2016లో ఫ్లాట్ అప్పగిస్తానని కంపెనీ ప్రతినిధులు చెప్పారని పేర్కొన్నారు. అయితే, ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వలేదని.. దీనిపై కంపెనీని ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేదని తెలిపారు. చివరకు జాతీయ వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించడంతో వారిపై క్రిమినల్, చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆదేశించిందని షఫాలీ వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుకు షరపోవా, షూమాకర్ ప్రమోటర్లుగా వ్యవహరించడంతోపాటు భాగస్వాములుగా కూడా ఉన్నారని తెలిసిందన్నారు. షరపోవా ఈ ప్రాజెక్టు సైట్ ను సందర్శించడంతోపాటు అక్కడ టెన్నిస్ అకాడమీతోపాటు స్పోర్ట్స్ స్టోర్ కూడా ప్రారంభిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే కొనుగోలుదారులతో డిన్నర్ కూడా చేస్తానని ఆమె హామీ ఇచ్చారని.. కానీ ఇవేవీ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.