ప్లాట్ అమ్మే ముందు ఓ లేఔట్ ప్లాన్ చూపించి, అనంతరం దానిని మార్చివేసి మోసం చేసిన బిల్డర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ లోని భటిండాకు చెందిన పీఎస్ పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ప్రముఖ బిల్డర్, సన్నీ ఎన్ క్లేవ్ యజమాని జర్నైల్ సింగ్ బజ్వా నుంచి 2013లో సెక్టార్ 123లో మనీష్ ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. అక్కడ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ ఫ్లాట్ కొన్నారు. దీనికి సంబంధించి 2014లో మొత్తం చెల్లింపులు పూర్తి చేశారు. అయితే, అనంతరం 2016లో మనీష్ కు తెలియకుండా, కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా ఆ లేఔట్ ను బజ్వా మార్చివేశారు. ఫలితంగా కొత్త లేఔట్ లో ఇల్లు కట్టుకోవడం మనీష్ కు సాధ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు జర్నైల్ సింగ్ బజ్వాతోపాటు ఆయన కుమారుడు సుఖ్ దేవ్ సింగ్ బజ్వా అలియాస్ సన్నీ, వారి హెచ్ ఆర్ మేనేజర్ దీపక్ శర్మలపై చీటింగ్, ఫ్రాడ్, క్రిమినల్ కుట్ర, ప్రాజెక్టు పేపర్లు, లేఔట్ ప్లాన్లను తప్పుగా చూపించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. సుఖ్ దేవ్ ను అరెస్టు చేయగా.. అనంతరం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. జర్నైల్ పరారీలో ఉన్నారని, ఆయన్ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.