- యూడీఎస్.. ప్రీలాంచ్..
- ధర తక్కువ.. అప్రీసియేషన్ ఎక్కువ..
- కాకపోతే ప్రాజెక్టు ప్రారంభమైతేనే!
- రెండు, మూడేళ్లయినా ఆరంభం కాకపోతే..
- అందులో కొన్నవారి పరిస్థితి ఏమిటి..
- మరి, ఇలాంటి ఇబ్బందులు వద్దనుకుంటే?
అధిక లాభాలను అందుకోవాలనే అత్యాశతో విద్యావంతులూ.. యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొన్నారు. వీరిలో చాలా మంది నిండా మునిగి.. అందులో నుంచి బయటికి రాలేక తంటాలు పడుతున్నారు. ప్రీలాంచ్ బిల్డర్లేమో ప్రాజెక్టులను ప్రారంభించట్లేదు. అందులో కొన్నవారికేమో సరైన సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే ఆ స్థలం ఏ జోన్ పరిధిలో ఉంది? అందులో న్యాయపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? స్థానిక సంస్థలు అనుమతుల్నీ ఎందుకు మంజూరు చేయట్లేదు.. ఇలాంటి విషయాల్ని ప్రీలాంచ్ బిల్డర్లు బయటికి చెప్పరు. కొనుగోలుదారులు ఒకవేళ నిలదీసినా.. ఏవో మాయమాటలు చెప్పి తప్పించుకుంటారు. మరి, ఇలాంటి మాయలమరాఠీల చేతిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కాస్త పేరున్న బిల్డర్.. మంచి లొకేషన్.. రెరా అనుమతి వచ్చాక.. సాఫ్ట్ లాంచ్లో ఫ్లాట్లను కొనుగోలు చేస్తే ఎలాంటి నష్టముండదు. ఎందుకంటే, రెరా అనుమతి లభించింది కాబట్టి.. సదరు బిల్డర్ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయకపోతే కొనుగోలుదారులు చింతించాల్సిన అవసరమే లేదు. ఒక్క ఫిర్యాదు చేస్తే చాలు.. రెరా అథారిటీయే ఆయా బిల్డర్ పని పడుతుంది. సాఫ్ట్ లాంచ్లో కొనడం వల్ల జరిగేదేమిటంటే.. ఆశించినంత అధిక లాభం రాదు. కాకపోతే, మన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. నిర్ణీత గడువులోపు ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆతర్వాత ఐదేళ్ల పాటు నిర్మాణ నాణ్యతలో ఎలాంటి లోపాలున్నా.. బిల్డరే బాధ్యత వహించాలి. కాబట్టి, సాఫ్ట్ లాంచ్లో ఫ్లాట్లను కొనడం వల్ల బయ్యర్లకు వచ్చే నష్టమేం లేదని గుర్తుంచుకోవాలి.