ప్రముఖ నటి శ్వేతా త్రిపాఠి శర్మ ఎల్లప్పుడు సానుకూల ధృక్పథాన్నే ప్రదర్శిస్తారు. త్వరలో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్న ఆమె ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో రియల్ ఎస్టేట్ గురు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పలు సంగతులను ఆమె పంచుకున్నారు. ‘నేను త్వరలోనే నా డ్రీమ్ హోమ్ కొనుగోలు చేయబోతున్నట్టు కల కన్నాను. సొంతిల్లు అనేది నా జాబితాలో టాప్ లో ఉంది. నా ఇల్లు ఎలా ఉండబోతుందనే దాని కంటే అందులో జీవించే అనుభూతే నాకు అంతిమం. నటి కాక ముందు నేను డిజైన్ విద్యార్థిని కాబట్టి.. క్రియేటివిటీతో నాకున్న సహజసిద్ధమైన అనుబంధం.. నా కలల ఇంటిని నిర్మించుకునేటప్పుడు కచ్చితంగా ఉపయోగపడుతుంది. నాకు సౌందర్య శాస్త్రం అంటే చాలా ఇష్టం’ అని మీర్జాపూర్ సిరీస్ లో నటించిన గోలు గుప్తా పేర్కొన్నారు.
‘మా నాన్న ఐఏఎస్ అధికారి. మేం ఢిల్లీలో ఉండేవాళ్లం. అక్కడ నుంచి అండమాన్ నికోబార్ దీవులకు బదిలీ కావడంతో అక్కడ మూడేళ్లు ఉన్నాం. అక్కడ మేం ఉండే ఇల్లు బ్రిటిషర్లను గుర్తు చేస్తుంది. ‘ఝులా’ అని పేరున్న ఆ ఇల్లు నాకు ఓ మధర జ్ఞాపకం. ఢిల్లీ ఇంట్లో హోలీ పార్టీలు నాకు అత్యంత ఇష్టమైన జ్ఞాపకాల్లో ఒకటి. అలాగే అండమాన్ ఇంటిని ఎప్పటికీ మరచిపోలేను. అక్కడ ఉన్న మూడు భారీ ప్రాంగణాల్లో సొంతంగా కూరగాయలు పండించే వాళ్లం. అక్కడ ఓ కుటీరంలో నివసిస్తున్నట్టు అనిపించేది. టెర్రస్ పైన కుందేళ్లు, గబ్బిలాలు ఉండేవి’ అని వివరించారు. తర్వాత శ్వేతా త్రిపాఠి శర్మ ముంబైకి మారారు. అక్కడే పదేళ్ల నుంచి ఉంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత జుహుకి మారారు. ‘విలాసవంతం బాగానే ఉంటుంది. కానీ దానిని మెయింటైన్ చేయడమే పెద్ద పని. నేను సొంతంగా ఓ మందిరం ఏర్పాటు చేసుకున్నాను. సోషల్ మీడియా మనకు ప్రతీది అమ్మడంలో బిజీగా ఉంటుంది. కానీ మోసపోకండి. అనవసరమైన హోర్డింగులు, బిల్ బోర్డులు మన మైండ్ స్పేస్ ను చాలా తినేస్తాయి. నేను ఏదైనా కొని దానిని సరిగా వినియోగించుకోలేకపోతే వెంటనే దానిని మరొకరికి బహుమతిగా ఇచ్చేస్తాను. నా డ్రీమ్ హోమ్ లో అరోమా థెరపీతోపాటు సంగీతం కూడా చాలా ముఖ్యమైనది. అందుకే మా ఇంట్లో చాలా సౌండ్ బార్లు ఉంటాయి. ఎందుకంటే నేను సౌండ్ హీలింగ్ ను నమ్ముతాను’ అని పేర్కొన్నారు.
జుహులో ఉన్న ఈ బంగ్లా తరహాలోనే తన డ్రీమ్ హోమ్ లో కూడా 24 గంటలూ పని చేసే కిచెన్ ఉండాలని శ్వేతా కోరుకుంటున్నారు. ఇక ఆ బంగ్లాలోని ఓ ప్రదేశంలో కేవలం క్రియేటివ్ సంభాషణలు మాత్రమే జరుగుతాయి. కళ, సినిమా.. ఈ రెండే ఆమె ప్రపంచం. ఇక శ్వేత నిర్మించాలనుకునే మరో కలల సౌథం కచ్చితంగా కొండలపైనే ఉంటుంది. ‘హాస్య నటి మల్లికా దువా ఇల్లు నాకు స్ఫూర్తినిస్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్ చాలా ప్రతిభావంతురాలు. ఆమె అన్నింటినీ బాగా గమనిస్తుంది. నేను ఏసియన్ పెయింట్స్ తో కలిసి పని చేయడానికి మల్లిక సహాయం చేశారు’ అని వివరించారు. చివరగా తనకు నటి అలియా భట్ ఇల్లంటే చాలా ఇష్టం అని చెప్పి ముగించారు.
This website uses cookies.