ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాల్ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.
సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూ సేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని తమ ప్రభుత్వమే భరిస్తోందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.