- 111 జీవో ప్రాంతాల్ని
ఎలా డెవలప్ చేస్తారు? - ఆ ఏరియా మాస్టర్ ప్లాన్
పూర్తయ్యిందా? లేదా? - దాంతో సంబంధం లేకుండా
ఎస్టీపీలను నిర్మిస్తారా? - మూసీపై ఎస్టీపీలు ఏమయ్యాయి?
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యల్ని తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాన్ని హరితమయం చేయడానికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని ప్రభుత్వ పెద్దలు పలుసార్లు ప్రకటించారు. ఇందుకోసం బృహత్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని.. అందుకు అనుగుణంగానే ఆయా ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామన్నారు. గత కొంతకాలం నుంచి చెబుతున్న ఈ మాటల్ని నిజమేనని కొంతమంది ప్రజలూ భావించారు. కానీ, మాస్టర్ ప్లాన్ తో సంబంధం లేకుండానే.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో నాలుగు ఎస్టీపీలను ఏర్పాటు చేయడానికి గతవారం పురపాలక శాఖ జీవోను విడుదల చేసింది. ఇందుకోసం రూ.82 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్ని జారీ చేసింది.
విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. 2016 నుంచి మురికి మూసిని సుజలరాశి చేస్తామని ప్రకటించి.. ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా కొన్ని బ్యాంకుల నుంచి రుణాల్ని సైతం తీసుకుంది. కానీ, ఆ పనుల పురోగతిపై నేటికీ అధికారికంగా ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో నాలుగు ఎస్టీపీలను ఏర్పాటు చేయడానికి జీవోను విడుదల చేసింది. మరి, మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే వీటిని ఏర్పాటు చేస్తున్నారా? లేక ట్రిపుల్ వన్ జీవో ప్రాంతానికి సంబంధించి విడిగా ఏమైనా ప్రణాళికల్ని రచిస్తున్నారా? అనే అంశం తెలియాల్సి ఉంది. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాన్ని ఏ తరహాలో అభివృద్ధి చేస్తారానే విషయంపై ప్రభుత్వం కొంత స్పష్టత ఇవ్వాలి.