దేశంలో రాబోయే రెండేళ్లలో సుపీరియర్ గ్రేడ్ ఏ కేటగిరీలో 8.6 మిలియన్ చదరపు అడుగులకు పైగా కొత్త మాల్ సరఫరా వస్తుందని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ వెల్లడించింది. వచ్చే రెండేళ్లలో మొత్తం 12.3 మిలియన్ చదరపు అడుగుల కొత్త గ్రేడ్ ఏ మాల్ సరఫరా అవుతుందని అంచనా వేయగా.. ఇందులో 70 శాతానికి పైగా సుపీరియర్ గ్రేడ్ ఏ మాల్స్ ఉంటాయని పేర్కొంది. ఇది భారతదేశంలో రాబోయే రిటైల్ మౌలిక సదుపాయాల నాణ్యతలో గణనీయమైన అప్‌గ్రేడ్‌ను సూచిస్తోందని నివేదిక తెలిపింది. 2026 చివరికి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో 19 ప్రీమియం షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది. సుపీరియర్-గ్రేడ్ మాల్స్ సాధారణంగా ప్రఖ్యాత డెవలపర్లు లేదా సంస్థాగత పెట్టుబడిదారుల యాజమాన్యం, నిర్వహణలో ఉంటాయి.
2024లో మనదేశంలో గ్రేడ్ ఏ మాల్ స్టాక్ 61.5 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. సుపీరియర్ గ్రేడ్ మాల్స్ 38.9 మిలియన్ చదరపు అడుగులు (63 శాతం) నమోదైంది. వీటి అద్దెలు 2019 నుంచి 29 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం నెలకు సగటున చదరపు అడుగుకు రూ.315గా ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే వంటి మెట్రో నగరాలు గ్రేడ్-A మాల్ స్టాక్‌లో ముందున్నాయి. ఈ మెట్రోలలోని సుపీరియర్-గ్రేడ్ ప్రాపర్టీల పట్ల పెట్టుబడిదారులు, రిటైలర్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. టాప్-గ్రేడ్ మాల్స్ లో పరిమిత స్థలం ఉండటం వల్ల అనేక ప్రీమియం బ్రాండ్‌లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లోని హై స్ట్రీట్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయని నివేదిక పేర్కొంది. ముంబైలోని లింకింగ్ రోడ్, ఢిల్లీలోని ఖాన్ మార్కెట్, కన్నాట్ ప్లేస్, బెంగళూరులోని ఎంజీ రోడ్ వంటి కీలకమైన హై స్ట్రీట్ ప్రదేశాలు ప్రసిద్ధ ప్రత్యామ్నాయాలుగా మారాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ హై స్ట్రీట్ లలో అద్దెలు కరోనా తర్వాత పెరిగాయి. హైపర్‌మార్కెట్లు, సినిమాహాళ్లు వంటి సాంప్రదాయ మాల్స్ లో అద్దెదారుల ప్రాముఖ్యత తగ్గుతోంది. అయితే ఫ్యాషన్, బ్యూటీ, వెల్‌నెస్, డైనింగ్ వంటివి బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ఫుడ్ అండ్ బెవరేజ్ (ఎఫ్ అండ్ బి) వంటివి మాల్స్ ఉనికిలో బలమైన వృద్ధిని సాధించాయి. ‘‘భారత రిటైల్ పరిశ్రమ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. వినియోగదారుల ఆకాంక్షలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
ఉన్నత శ్రేణి మాల్స్ మరిన్ని అందుబాటులోకి రావడం విస్తరణకే కాకుండా నాణ్యత, మెరుగైన అనుభవానికి పెరిగిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. ఉత్పత్తి ఎంత ముఖ్యమో, మెరుగైన బ్రాండ్ అనుభవానికీ నేడు కస్టమర్ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిటైల్ ఇండియా హెడ్ సౌరభ్ షట్దాల్ తెలిపారు. సౌందర్య, ఆరోగ్య సంరక్షణ, ఆహారం-పానీయాలు, క్రీడా వస్త్రాల విభాగాలు రిటైల్ పరిశ్రమ తదుపరి దశను మార్చనున్నాయని చెప్పారు.
This website uses cookies.