దేశంలో పెరుగుతున్న వృద్ధులు
2050 నాటికి ప్రపంచ వృద్ధుల్లో 17 శాతం మనదేశంలోనే
వారి సౌకర్యాల కల్పన, సీనియర్ లివింగ్ హోమ్ లకు పెరగనున్న డిమాండ్
సీబీఆర్ఈ నివేదిక వెల్లడి
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. త్వరలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా అవతరించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ప్రస్తుతం మనదేశం సిల్వర్ ఎకానమీ వైపు పరుగులు పెడుతోంది. అంటే 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల అవసరాలు తీర్చడానికి రూపొందించే అన్ని ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవలు పెరగడం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే సీనియర్ సిటిజన్లు పెరిగితే.. వారి అవసరాలకు తగిన ఉత్పత్తులు, సేవలు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా సంబంధిత ఆర్థిక కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తాయి. దీనినే సిల్వర్ ఎకానమి అంటారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో కూడా సీనియర్ సిటిజన్ల సంఖ్య ఎక్కువవుతోంది. 2050 నాటికి ప్రపంచ వృద్ధుల జనాభాలో 17 శాతం మంది భారత్ లోనే ఉంటారని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ పేర్కొంది. ప్రత్యేక సంరక్షణ, జీవనశైలి కోరుకునే వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల జీవన సౌకర్యాల కోసం ఇటీవల డిమాండ్ కూడా బాగా పెరిగింది. పాన్ ఇండియా ప్రాతిపదికన సీనియర్ సీనియర్ కేర్ ల్యాండ్ స్కేప్ విభాగం కూడా బాగా అభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఇవి దాదాపు 18వేల యూనిట్లు విస్తరించి ఉండటమే ఇందుకు నిదర్శనం. సంస్థాగత సీనియర్ లివింగ్, కేర్ విభాగంలో మొత్తం సరఫరాలో 62 శాతం వాటాతో దక్షిణ భారతదేశం ఇందులో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇందుకు చాలా కారణాలున్నాయి.
ముఖ్యంగా అధిక స్తోమత స్థాయి కలిగి ఉండటంతోపాటు మైక్రో ఫ్యామిలీలు ఎక్కువవడం వల్ల ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య అధికంగా ఉంది. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కలిగి ఉండటం మరో కారణం. వృద్ధాప్య సంరక్షణ సేవలపై అవగాహన కల్పించడం, శిక్షణ పొందిన సిబ్బంది లభ్యత ఎక్కువగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ రంగంపై ఈ ప్రాంతం దృష్టి సారించడం వంటి అంశాలు సీనియర్ కేర్ నాణ్యతను మరింత మెరుగుపరిచాయి. ఈ విభాగంలో కీలక ప్లేయర్లు చెన్నై, కొయంబత్తూరు, బెంగళూరు వంటి దక్షిణాది టైర్-1, టైర్-2 నగరాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. భవిష్యత్తులో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొయంబత్తూర్, పుణె, ఢిల్లీలో విస్తరించే అవకాశం ఉంది.
దక్షిణ భారతదేశం కాకుండా హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లలో సీనియర్ లివింగ్ అండ్ కేర్ యూనిట్లు ఉన్నాయి. మార్కెట్ మొత్తం వాటాతో ఇవి 25 శాతం వాటా కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్,మధ్యప్రదేశ్ లతో కూడిన సెంట్రల్ జోన్ లో సీనియర్ లివింగ్ యూనిట్ల వాటా 13 శాతంగా ఉంది. ఢిల్లీ, పుణె వంటి నగరాలతో సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వీటి వాటా చాలా తక్కువగా ఉంది. జైపూర్ లో కూడా ఇవి చాలా పరిమిత స్థాయిలో ఉన్నాయి. కాగా, 2024లో వృద్ధుల జీవన సౌకర్యాల కల్పన లక్ష్యం పది లక్షలు కాగా, రాబోయే 10 సంవత్సరాలలో ఇది 25 లక్షలకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం మనదేశంలో దాదాపు 15 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. ఇది వచ్చే పది నుంచి 12 ఏళ్లలో 230 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత వృద్ధుల సంరక్షణ మార్కెట్ మనదేశంలో గణనీయంగా పెరిగింది. ఈ విభాగం భారీగా వృద్ధి చెందడానికి చాలా కారణాలున్నాయి. అవేమిటంటే..
భారతదేశ సీనియర్ జనాభా మొత్తం జనాభా కంటే వేగంగా పెరుగుతోంది.
మైక్రో ఫ్యామిలీలు ఎక్కువవుతున్నాయి. వృద్ధుల్లో దాదాపు 29 శాతం మంది ఒంటరిగా లేదా జీవిత భాగస్వామితో మాత్రమే నివసిస్తున్నారు.
వృద్ధాప్యంలో ఆధారపడే నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల అంచనా వేశారు. 2020లో ఇది 16 శాతం ఉండగా.. 2050 నాటికి 34 శాతానికి చేరుతుందని అంచనా.
దేశంలోని దాదాపు 70 శాతం మంది సీనియర్ సిటిజన్లు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రధానంగా సీవీడీలు, మధుమేహం, దృష్టి సంబంధిత రుగ్మతలు, రక్తపోటుతో సతమతమవుతున్నారు.
హెల్త్ కేర్ గ్రూపులు కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. సహాయక జీవన విభాగంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి.
34 కోట్ల మంది వృద్ధులు..
‘భారతదేశం సీనియర్ జనాభా 254 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభా విభాగంగా ఇది మారింది. 2050 నాటికి భారతదేశం 34 కోట్ల మంది వృద్ధులకు నిలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో ఇది 17 శాతం. భారతదేశంలో గత దశాబ్దంలో సీనియర్ లివింగ్ ప్రాజెక్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఈ విభాగంలో డిమాండ్ ను ప్రతిబింబింపజేస్తోంది. ఈ సెగ్మెంట్లోని డెవలపర్లు సీనియర్ లివింగ్ సెగ్మెంట్ భవిష్యత్తుపై ఆశావద దృక్పథంతో ఉన్నారు. వృద్ధుల్లో ప్రత్యేక సంరక్షణ, జీవనశైలి ఎంపికల కోసం పెరుగుతున్న డిమాండ్ ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. స్థిరమైన విస్తరణ, ఆవిష్కరణ కోసం మార్కెట్ సామర్థ్యాన్ని వారు గుర్తించారు. ఇది వారి విస్తరణ ప్రణాళికల్లో స్పష్టంగా కనిపిస్తోంది’ అని సీబీఆర్ఈ ఇండియా సీఈవో అన్షుమన్ మ్యాగజీన్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఇవే సంస్థలు..
అతుల్య సీనియర్ కేర్, కైట్స్ సీనియర్ కేర్, సెకండ్ ఇన్నింగ్స్, పీపీ రెడీ రిటైర్మెంట్ హోమ్స్, క్షేత్ర, హెచ్‌సీఏహెచ్
వంటివి ఈ విభాగంలో సేవలు అందిస్తున్నాయి.