గండిపేట్ మండలంలోని పొప్పాల్‌గూడలో గల నార్సింగి చెరువును చెరపట్టినందుకు ఫినీక్స్ సంస్థకు సుప్రీం కోర్టు నోటీసుల్ని జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, ప్రముఖ పర్యావరణవేత్త డా.లుబ్నా సార్వత్ ఒక ప్రకటనలో తెలిపారు. నార్సింగి చెరువు మీద ఫినీక్స్ ఆక్రమణల్ని తొలగించాలని ఆమె సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై స్పందించేందుకు ఫినీక్స్ సంస్థకు సుప్రీం కోర్టు అక్టోబరు 18 దాకా గడువునిచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. ఫినీక్స్ సంస్థ నార్సింగి చెరువు 2ను ధ్వంసం చేశారని తెలుసుకున్న డా. లుబ్నా సార్వత్.. 2020 ఫిబ్రవరిలో ఎన్జీటీ కోర్టులో ఫినీక్స్‌కు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు. ఫినీక్స్ సంస్థకు వ్యతిరేకంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్‌జీటీ కోర్టుకు తెలిపారు. అయితే, జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన ఎన్‌జీటీ.. ఆయా సభ్యుల నివేదిక ఆధారంగా కేసును కొట్టేసింది. దీంతో ఆమె ఎన్‌జీటీ తీర్పును సుప్రీం కోర్టులో 2024 ఆగస్టు 9న, 2024 సెప్టెంబరు 23న సవాలు చేశారు. అప్పటి ప్రభుత్వం ఫినీక్స్‌కు అండగా నిలవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముఖ్య లక్ష్యాన్ని ఉల్లంఘించినట్లు అయ్యిందని డా.లుబ్నా సర్వత్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు.