బడా బిల్డరుపై భారీ విజ‌యం!

నోయిడా సెక్టార్ 93 లోని సూపర్‌టెక్ 40 అంతస్తుల అక్రమ జంట టవర్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో, ఎమరాల్డ్ కోర్ట్ నివాసితులు ఎట్టకేలకు న్యాయం గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టుపై తమ విశ్వాసం బలపడిందని చెప్పారు. తమ ఆవరణలో ఉన్న రెండు అక్రమ ఎత్తైన టవర్లను కూల్చివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంతో వారి దశాబ్దకాల న్యాయ పోరాటం ముగిసిందని ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..

సూపర్ టెక్ సంస్థ 15 టవర్లలో 660 ఫ్లాట్‌లను కట్టాలి. అయితే, 2009లో రెండు టవర్ల నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. ఈ అంశాన్ని నివాసితులు ప్రశ్నించడంతో ప్రాజెక్టులో భాగమని సంస్థ తెలియజేసింది. కాకపోతే భవనానికి సంబంధించిన ప్లాన్లను చూస్తేనేమో నిబంధనలకు విరుద్ధంగా రెండు వేర్వేరు టవర్లు కట్టడం కనిపించింది. బిల్డర్ తమని మోసం చేస్తున్నారని అనిపించిందని స్థానికులు తెలిపారు. 2012 లో కొంతమంది నివాసితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు, రెండు సంవత్సరాల తరువాత రెండు టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది, అయితే సూపర్ టెక్ డెవలపర్ దానిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఇటీవల కూల్చివేత సమంజసమేనని తీర్పునిచ్చింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. “సత్యం విజయం సాధించింది మరియు సుప్రీంకోర్టుపై మా విశ్వాసం బలపడింది. మేం ప్రభావవంతమైన బిల్డర్‌కి వ్యతిరేకంగా అనేకమందిని కలిశామని.. కొన్నేళ్ల పాటు చేసిన పోరాట ఫలితమే సుప్రీం కోర్టు తాజా నిర్ణయమ”ని 74 ఏళ్ల శర్మ అన్నారు.
ఎమరాల్డ్ కోర్టులోని మరో నివాసి రచనా జైన్ మాట్లాడుతూ, తప్పు చేయడాన్ని వ్యతిరేకించిన నివాసితులందరికీ ఇదో గొప్ప విజయంగా అభివర్ణించారు. తన భర్త ఇదే కేసుపై పోరాటం చేశారని.. గతేడాది కొవిడ్ వల్ల దుర్మరణం చెందారని చెప్పుకొచ్చారు.

సుప్రీం కోర్టు ఆదేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాల్ని చేపట్టే వ్యక్తి ఎంత పెద్ద బిల్డర్ అయినా ఊపేక్షించేది లేదని సుప్రీం కోర్టు తాజా తీర్పు ద్వారా నిర్మాణ రంగానికి తెలిసొచ్చింది. కాబట్టి, ఇక నుంచి అక్రమ పద్దతిలో అపార్టుమెంట్లను నిర్మించడానికి బిల్డర్లు సాహసించరని నివాసిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

This website uses cookies.