-
జీహెచ్ఎంసీకి తెలియకుండానే కడతాడా
-
బండ్లగూడలో అరవై కుటుంబాల ఆవేదన
-
ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్ షిప్ కూల్చివేత
-
ఆందోళనలో బాధితులు
44 ఎకరాల్లో అపార్టుమెంట్లు కట్టడం రాత్రికి రాత్రే సాధ్యం కాదు. పునాదులు పడే స్థాయి నుంచి పిల్లర్లు వేసి.. శ్లాబులేసే ప్రతి దశలోనూ జీహెచ్ఎంసీలోని కింది స్థాయి నుంచి బడా అధికారులకూ సమాచారం ఉంటుంది. కాకపోతే, ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది, ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. అధికారులు కళ్లు మూసుకున్నారు కదా అని బిల్డర్ చెలరేగిపోయాడు. మొత్తానికి, ఈ అక్రమ నిర్మాణం జరిగే సమయంలో కళ్లు మూసుకుని వ్యవహరించిన జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. అరవై మంది ప్రజల కష్టార్జితాన్ని ఎవరు తిన్నట్లు? వీరు మళ్లీ సొంతిల్లు కొనుక్కోవడం సాధ్యమవుతుందా? వీరికి కలిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి?
దాదాపు 60 కుటుంబాలు.. కష్టార్జితం అంతా తెచ్చి కొందరు.. ఉన్నవి తెగనమ్ముకుని డౌన్ పేమెంట్ కట్టి మరికొందరు.. తమ సొంతింటి కల నెరవేర్చుకుందామని, కొత్త ఇంట్లోకి వెళదామని కోటి ఆశలతో ఉన్నవేళ.. అది అక్రమ కట్టడం అన్న వార్త పిడుగులా పడింది. హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టడంతో వారి కలలు కల్లలుగా మారిపోయాయి. ఇదీ బండ్లగూడలోని ప్రైడ్ ఇండియా క్రిస్టల్ టౌన్ షిప్ లో ఫ్లాట్ల కొనుగోలుదారుల వ్యథ. 44 ఎకరాల ఈ టౌన్ షిప్ అక్రమంగా నిర్మించారని హైకోర్టు నిర్ధారించడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. దీంతో అందులో ఫ్లాట్లు కొనుగోలుచేసినవారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 2016లో మొదలైన వివాదం చివరకు కూల్చివేతకు దారితీసింది
అక్కడ నిర్మాణాలు అక్రమమని ప్రభుత్వానికి తెలిసిన పక్షంలో అమ్మకాలను ఎందుకు ఆపలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
చాలామంది అందులో కొనుగోలు చేసిన తర్వాత అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూల్చివేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పట్టాదారుల నుంచి ప్రైడ్ ఇండియా ఆ భూమిని కొనుగోలు చేసింది. అనంతరం బిల్డర్లు ప్రైడ్ ఇండియా నుంచి చిన్న చిన్న ప్లాట్లను కొనుగోలు చేసి, లేఔట్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. భూమి కొనుగోలుకు సంబంధించి కొంత మొత్తాన్ని ప్రైడ్ ఇండియా చెల్లించకపోవడంతో పట్టాదారులు 2016లో హైకోర్టుకు వెళ్లారు. దీంతో లేఔట్ అనుమతులు ఆగిపోయాయి. అయితే, ఈ విషయాలు అందులో ఇళ్లు కొనుగోలు చేసినవారికి తెలియకపోవడంతో నిర్మాణాలు చేపట్టారు. ఇవన్నీ అక్రమ నిర్మాణాలని హైకోర్టు నిర్ధారించడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు