Categories: LEGAL

ప‌సిఫికా డెవ‌ల‌ప‌ర్స్‌ ఎండీని కస్టడిలోకి తీసుకోండి

  • ఆదేశించిన రెరా అథారిటీ
  • సొమ్ము చెల్లించినా బయ్యర్ కు ఇవ్వని ఫ్లాటు
  • అదే ఇల్లు ఇవ్వాలని రెరా ఆదేశం
  • పట్టించుకోకుండా వేరొకరికి విక్రయం
  • రెరా ఆదేశాలు బేఖాతరు
  • హైద‌రాబాద్‌లో నిర్మాణాల్ని క‌డుతున్న ప‌సిఫికా

తాను ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఓ నిర్మాణ కంపెనీకి చెందిన నలుగురిపై రెరా కన్నెర్ర జేసింది. ఆ నలుగురినీ 30 రోజులపాటు కస్టడీకి తీసుకోవాలని ఆదేశించింది. ఫ్లాటు కొనుగోలుదారుకు ఆ ఫ్లాట్ అప్పగించాలని రెరా ఆదేశించినా.. వాటిని ఉల్లంఘించి, అదే ఫ్లాటును మరో వ్యక్తికి విక్రయించినందుకు రెరా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పసిఫికా డెవలపర్స్ కి చెందిన ఎండీతో పాటు అదే కంపెనీకి చెందిన దర్పణ్ తర్వాణీ, కౌశిక్ పటేల్, జయ్ చందానీలను అదుపులోకి తీసుకోవాలని రెరా ఆదేశించింది.

పసిఫికా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ గుజరాత్ గాంధీనగర్ లోని ఖోరాజ్ లో రిఫ్లెక్షన్స్ పేరుతో ఓ ప్రాజెక్టు ప్రారంభించింది. మస్కట్ లో నివసిస్తున్న రచనా శర్మ 2012 నవంబర్ లో అందులో రూ.56.67 లక్షలకు ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందుకోసం వివిధ ఛార్జీల కింద తొలుత రూ.9.82 లక్షలు చెల్లించారు. అనంతరం 2014 జూలైలో ఆమె పేరుతో ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే, ఆమె రూ.15.24 లక్షలు నగదు (ఇది నిర్ధారణ కాలేదు), రూ.41.43 లక్షలను బ్యాంకు ద్వారా బిల్డర్ కు చెల్లించారు. 2015 అక్టోబర్ నాటికి ఫ్లాట్ అప్పగించాల్సి ఉంది. అయితే, డెవలపర్ ఆమెకు ఫ్లాట్ అప్పగించలేదు. దీంతో రచనా శర్మ రెరాను ఆశ్రయించగా.. రూ.18.69 లక్షలు చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా ఫ్లాట్ అప్పగించాలని 2019 ఆగస్టులో గుజరాత్ రెరా.. సదరు బిల్డర్ ను ఆదేశించింది. ఈ క్రమంలో రచనా శర్మ ఆ మొత్తం చెల్లించినప్పటికీ, డెవలపర్ ఆమె బుకింగ్ ను రద్దు చేసి అదే ఫ్లాట్ ను లలితా పటేల్ అనే వ్యక్తికి విక్రయించారు. ఈ విషయాన్ని రెరా దృష్టికి తీసుకెళ్లడంతో నిర్మాణ సంస్థకు చెందిన నలుగురినీ అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.

ప‌సిఫికా డెవ‌ల‌ప‌ర్స్ న‌గ‌రంలో ప‌లు ప్రాజెక్టుల్ని చేప‌డుతున్న‌ది. ఇక్క‌డా త‌మ‌ను ఈ సంస్థ ఇబ్బందుల‌కు గురి చేసింద‌ని పలువురు కొనుగోలుదారులు తెలంగాణ రెరా అథారిటీకి ఫిర్యాదు చేశారు. మ‌రి, ఆ ఫిర్యాదుపై రెరా ఎలా స్పందిస్తుందో తెలియాలంటే మ‌రికొంత‌కాలం వేచి చూడాల్సిందే.

This website uses cookies.