టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ మేనేజింగ్ పార్ట్‌నర్
యార్లగడ్డ మురళీకృష్ణ
నిర్మాణ రంగంలో ప్రొఫెషనలిజాన్ని పాటించే బిల్డర్లు.. నిర్ణీత గడువులోపే ప్రాజెక్టులను నాణ్యతతో కూడా కొనుగోలుదారులకు అందజేస్తారని టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ మేనేజింగ్ పార్ట్‌నర్ యార్లగడ్డ మురళీకృష్ణ తెలిపారు. మియాపూర్‌లోని నైలా ప్రాజెక్టులో మాక్ ఫ్లోర్‌తో పాటు మోడల్ ఫ్లాట్‌ను ఆరంభించిన సందర్భంగా రెజ్‌న్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎక్కడ ప్రాజెక్టును ఆరంభించినా, బిల్డర్లకు కాస్టింగ్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడే.. సకాలంలో ఫ్లాట్లను హ్యాండోవర్ చేస్తారని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదొడుకులు నెలకొన్నప్పుడే.. వాటి తట్టుకుని నిలబడేలా నిర్మాణ సంస్థలు ప్రణాళికల్ని రచించాలని అభిప్రాయపడ్డారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
మార్కెట్‌కు బెస్ట్ ప్రాడక్ట్‌ను అందించాలనే ప్యాషన్ ఉంటే.. ఎన్ని గంటలైనా కష్టపడి పని చేస్తాం. ఎవరూ చేయలేనిది మనం చేయాలనే తపన ఉంటే.. నాణ్యతతో పాటు సమయానికి ప్రాజెక్టును సకాలంలో అందించాలన్న నిత్య ఆలోచనలుంటే.. మంచి ప్రాడక్టును కొనుగోలుదారులకు అందించగల్గుతాం. మియాపూర్ నైలా ప్రాజెక్టును డిజైన్ చేయడానికే ఎనిమిది నెలలు దాకా పట్టింది. రెండేళ్ల క్రితం ఆరంభించిన నైలా ప్రాజెక్టు ప్రస్తుతం తొంభై శాతం దాకా స్ట్రక్చర్ పూర్తయ్యింది. అంటే మా టీమ్ ఫోర్ మేనేజ్‌మెంట్ డెడికేషన్, కస్టమర్లకు మేమిచ్చిన కమిట్‌మెంట్ వల్లే ఇది సాధ్యమైంది. మియాపూర్ నైలా ప్రాజెక్టును మూడు భాగాలుగా విభజించాం. ఒకటి స్ట్రక్చర్, రెండోది ఎంఈపీ, మూడోది ఫినిషెస్. ఈ మూడింట్లో స్ట్రక్చర్ పార్టు తొంభై శాతం పూర్తయ్యింది. మిగతా పది శాతం జూన్‌లోపు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఎంఈపీ అరవై శాతం, ఫినిషింగ్ 30-40 శాతం పూర్తయ్యింది. నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తూ వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం.
టీమ్ ఫోర్ అంటే..
టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్..నేటితరపు నాయకత్వ లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న సంస్థ. ట్రూత్, ట్రస్ట్, ట్రాన్స్‌పరెన్సీ, టీమ్ వర్క్.. ఇవన్నీ కలిపితేనే టీమ్ ఫోర్ అని మేం ప్రగాఢంగా విశ్వసిస్తాం. తూ.చా. తప్పకుండా పాటిస్తాం. మరో విషయం ఏమిటంటే.. మేం నలుగురం హైలీ ప్రొఫెషనల్స్. మేమంతా గతంలో పలు సంస్థల్లో కొన్ని వేల ఎకౌంట్లను మేనేజ్ చేశాం. ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్, ప్రొఫెషనల్ అప్రోచ్ ఉండటం వల్ల ఒక బృందంగా ఏర్పడి బెస్ట్ ప్రాడక్ట్‌ను అందించాలన్న కంకణం కట్టుకున్నాం. ప్రతి అంశాన్ని కూలకషంగా చర్చించి నిర్ణయాల్ని తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టును మెరుగుపరిచే విధానంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండాలి.. కానీ డిఫరెన్సెస్ ఉండకూడదని ఎప్పుడూ అనుకుంటాం. వార్ రూములో ఉన్నప్పుడే బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాం. తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతాం. అయితే, మోజార్టీ డిసీషన్ వైపు తుదకు మొగ్గు చూపుతాం.
మియాపూర్ ఎందుకు?
వెస్ట్ హైదరాబాద్‌లో దిగ్గజ నిర్మాణ సంస్థలున్నాయి. ఎక్కడ చూసినా ఆధునిక విల్లాలు, ఆకాశహర్మ్యాలే దర్శనమిస్తాయి. కానీ, మియాపూర్‌లో ఆశించినంత లగ్జరీ కట్టడాలు లేవని తొలుత భావించాం. పైగా, మంచి ప్రాడక్ట్ లభిస్తే.. కొనుగోలు చేసేవారూ ఇక్కడున్నారని మా సర్వేలో తేలింది. మా అంచనాలు నిజమేనని ఈ ప్రాజెక్టులో జరిగిన అమ్మకాలే నిదర్శనం. ఈరోజుల్లో మియాపూర్‌లో నిర్మితమవుతున్న కట్టడాల్ని పరిశీలిస్తే.. క్వాలిటీలో కానీ పనుల్లోవేగంలో కానీ, మా నైలా ప్రాజెక్టు అత్యుత్తమంగా కనిపిస్తుంది. 26 నెలల్లో 90 శాతం స్ట్రక్చర్ పూర్తి చేశామంటే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. వాస్తవానికి, ఈ ప్రాజెక్టును కొనుగోలుదారులకు వచ్చే ఏడాదిలో అందజేయాలి. కానీ, అంతకంటే ముందు బయ్యర్లకు అందించేందుకు 24 గంటలూ కష్టపడి పని చేస్తున్నాం. మేం ఒక బృందంగా, మా సిబ్బంది కూడా తపనతో పని చేస్తుండటం వల్ల ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయగల్గుతున్నాం. మేం ఎప్పుడూ ఉద్యోగులకే మొదటి ప్రాధాన్యతనిస్తాం.
అదొక అద్భుత అవకాశం..
రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ఒడిదొడుకులు సహజమే. కాకపోతే, అప్పుడే మన బలమేమిటో బయటపడుతుంది. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా, మేం కొనుగోలుదారులకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మార్కెట్లో లాభాలున్నప్పుడు నష్టపోయే బిల్డర్లు ఉంటారు. అదేవిధంగా, నష్టాల్లో ఉన్నప్పుడు లాభపడేవారూ ఉంటారు. అయితే, మనం ఎటువైపు ఉండాలన్న విషయాన్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా లేనప్పుడు.. అదో అవకాశంగా మేం పరిగణిస్తాం. అందుకు అనుగుణంగా ప్రణాళికల్ని రచిస్తూ ముందుకెళుతున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు స్థిరపడటానికి కొంత సమయం పడుతుందనే విషయం తెలిసిందే. అదొక అవకాశంగా తీసుకుని పని చేసుకుంటూ ముందుకెళుతున్నాం. కాకపోతే, హైదరాబాద్ రియాల్టీకి తిరుగే ఉండదని మేం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.
బిల్డర్లకు వీటిపై అవగాహన
ప్రస్తుత పరిస్థితుల్లో అపార్టుమెంట్లు కట్టే బిల్డర్లు ఎవరైనా.. బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. కాస్టింగ్‌తో పాటు ప్రాజెక్టు డెలివరీ షెడ్యూల్ మీద కూడా స్పష్టత ఉండాలి. వీటిని పాటించే బిల్డర్లు ఎవరైనా సకాలంలో కొనుగోలుదారులకు అపార్టుమెంట్లను అందించగలరు.
హెచ్‌సీఎల్ సీఈవో వినీత్ నాయర్ని చూసి..
ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నుంచి నేను వచ్చాను. అక్కడ మా సీఈవో వినీత్ నాయర్ అని ఉండేవారు. ఆయనెప్పుడూ ఉద్యోగులకే ఫస్ట్ ప్రయార్టీ ఇచ్చేవారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి, టీమ్ ఫోర్‌లో పని చేసే ఉద్యోగులకు మంచి శిక్షణనిస్తాం, టీమ్ బిల్డింగ్ కార్యక్రమాల్ని చేపడతాం, సరైన వ్యక్తుల్ని ఎంచుకోవడం, ఉద్యోగులకు జీతాల్ని పెంచడం వంటి విషయాలపై నిరతరం దృష్టి సారిస్తాం. ప్రతిఒక్కరిని నైపుణ్యాల్ని పెంపొందించేందుకు ప్రోత్సహిస్తాం. కొత్త విషయాల్ని నేర్చుకోమంటాం. అందుకు అవసరమయ్యే ఖర్చునూ భరిస్తాం.