ఆఫీసు స్పేస్ టేకప్ లో ఆచితూచి అడుగులేస్తున్న కంపెనీలు
ఫ్లెక్స్ స్పేస్ బెటరనే భావనతో అటే అడుగులు
ప్రపంచవ్యాప్తంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ మన దేశంలో ఫెక్స్ స్పేస్ లకు డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచ పరిణామాలు, మార్కెట్లు అస్థిరంగా ఉండటంతో తమ అవసరాలను అంచనా వేయడం పరిశ్రమలకు సవాల్ గా మారింది. ఉద్యోగులు కోరుకున్న సౌలభ్యాన్ని అందించడం, ఆఫీసు స్పేస్ విషయంలో కాస్త గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా చాలా కంపెనీలు ఆఫీసు టేకప్, పెట్టుబడిపై నిర్ణయాలను వాయిదా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్స్ స్పేస్ ల వైపు మొగ్గు చూపిస్తున్నాయని కొలియర్స్ తాజా నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ విషయంలో టెక్ పరిశ్రమ ముందుంది.
దేశంలోని మొత్తం ఫ్లెక్స్ స్పేస్ లో 50 శాతం వాటా టెక్ కంపెనీలదే. సంస్కృతిని చెక్కుచెదరకుండా ఉంచడానికి, ఉత్తమ ప్రతిభను ఆకర్షించడానికి, దానిని నిలుపుకోవడానికి, కార్యాచరణ ఖర్చులను నియంత్రించడానికి సరైన పోర్ట్ ఫోలియో అవసరం. టెక్ కంపెనీలు ఈ విషయంలో ఉద్యోగుల కోరిక మేరకు ఫ్లెక్స్ స్పేస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. వాణిజ్య రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే భారతదేశం ఎల్లప్పుడు పెద్ద, అభివృద్ధి చెందుతున్న మార్కెట్. కరోనా ముప్పు, మాంద్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల భయం ఉన్నప్పటికీ.. ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలంగా ఉంది. టెక్, ఈ కామర్స్, త్రీపీఎల్, కన్సల్టింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ సహా అనే పరిశ్రమలు గత కొన్ని త్రైమాసికాలుగా వేగవంతమైన వృద్ధి సాధించి, దేశవ్యాప్తంగా కార్యాలయ ఆస్తులకు డిమాండుదారులుగా ఉన్నాయి.
ఫ్లెక్స్ స్పేస్ లు వికేంద్రీకృత వర్క్ స్పేస్ మోడల్ లా కంపెనీలకు ఓ ప్రధాన వ్యూహంగా మారాయని, ఇవి సంప్రదాయ నమూనాకు చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగడుతున్నాయని ఆఫీస్ సర్వీసెస్ ఇండియా ఎండీ పీయూష్ జైన్ అభిప్రాయపడ్డారు. కరోనాకు ముందు ఫ్లెక్స్ స్పేస్ లను ఒకటి లేదా రెండేళ్లకు మాత్రమే లీజుకు తీసుకునే పరిస్థితి ఉండగా.. ప్రస్తుతం అది 3 నుంచి 5 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందాలు చేసుకునే స్థాయికి వెళ్లిందని పేర్కొన్నారు. 2022లో ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్ల లీజింగ్ దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 7 మిలియన్ చదరపు అడుగులు చేరుకుంది. ఇప్పటివరకు ఇదే అత్యధికంగా కావడం విశేషం. 2023 క్యూ1లో 1.02 మిలియన్ చదరపు అడుగుల ఫ్లెక్స్ స్పేస్ తో బెంగళూరు అగ్ర స్థానంలో ఉంది. మొత్తం ఫ్లెక్స్ లీజింగ్ లో ఇది 50 శాతం కావడం గమనార్హం. 31 శాతం వాటాతో ఢిల్లీ, 8 శాతం వాటాతో చెన్నై, పుణెలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 0.04 మిలియన్ చదరపు అడుగులతో 2 శాతం వాటాను హైదరాబాద్ కలిగి ఉంది.