కార్పొరేషన్లలో ప్రప్రథమం
మంచి ఆలోచన.. శభాష్
అంటున్న ప్రజలు..
పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి వినూత్నంగా ఆలోచించే వ్యక్తి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలున్న ఆయన.. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్.. ట్రిపుల్ ఆర్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదేదో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తేజ్.. ట్రిపుల్ ఆర్ సినిమా అనుకునేరు. అది ఎంతమాత్రం కానే కాదు. ఇక్కడ ట్రిపుల్ ఆర్ అంటే.. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని అర్థం. ప్రత్యేకంగా ట్రిపుల్ ఆర్ సెంటర్లను కార్పొరేషన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో తెలుసా?
ప్రతి ఇంట్లో రీసైకిల్ చేయగలిగే వస్తువులు అనగా పాత బట్టలు, బెడ్ షీట్స్, పాత పుస్తకాలు, పాత బొమ్మలు, పాత ప్లాస్టిక్ వస్తువులను ఈ సెంటర్ల ద్వారా సేకరిస్తారు. అనంతరం వాటిని ఇతరులు ఉపయోగించుకునేలా తయారు చేసి, అసవరమైన వారికి అందజేస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఇంట్లో ఉన్న వినియోగించని, ఇతరులకు ఉపయోడపడే ఏ వస్తువులనైనా ఈ ట్రిపుల్ ఆర్ సెంటర్లలో అందజేసి సహకరించాలని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకటరెడ్డి కోరారు. వాటిని తాము నీట్ గా తయారు చేసి ఈ సెంటర్లలో ఉంచుతామని.. వాటిని కొనలేని పేదలు ఇక్కడకు వచ్చి వాటిని తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ప్రతి వార్డులోనూ ఈ సెంటర్లు ఉంటాయని తెలిపారు.