Categories: LATEST UPDATES

ఆఫీస్ స్పేస్ కు టెక్ పార్కుల దన్ను

  • సరఫరాలో 60 నుంచి 65 శాతం వీటి ద్వారానే వచ్చే చాన్స్
  • ఈ ఏడాది కూడా దూసుకెళ్లనున్న ఆఫీస్ రంగం
  • సీబీఆర్ఈ నివేదిక అంచనా

భారత రియల్ రంగంలో దూసుకెళ్తున్న ఆఫీస్ రంగం.. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగించనుంది. స్థిరమైన ఆర్థిక విధానాలు, దృఢమైన ఉపాధి కల్పన, అందుబాటులో నిపుణుల లభ్యత, సెజ్ డీనోటిఫికేషన్ నిబంధనల సడలింపు వంటి అంశాలు ఆక్యుపయర్ల విశ్వాసాన్ని పెంచుతుండడంతో ఆఫీస్ రంగం క్రమంగా దూసుకెళ్తోందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆఫీస్ రంగం ఆరోగ్యకరమైన సరఫరా వృద్ధిని చూసింది. 2025లోనూ ఇదే ఊపు కొనసాగేలా డెవలపర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కొత్తగా వచ్చే సరఫరాలో 60 నుంచి 65 శాతం అగ్రనగరాల్లోని ఇంటిగ్రేటెడ్ టెక్ పార్కుల ద్వారా రానుంది.

ఇక ఆఫీస్ స్పేస్ కు సంబంధించి పూర్తి సౌకర్యాలు కలిగిన గ్రీన్ సర్టిఫైడ్ ప్రాపర్టీలపైనే డెవలపర్లు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆఫీస్ స్పేస్ విషయంలో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై వంటి కేంద్రాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, చెన్నై, పుణె వంటి ఇతర కీలక నగరాలు కూడా ప్రాధాన్యతను దక్కించుకుంటున్నాయి. ఈ ధోరణి టైర్-II నగరాల్లో లీజింగ్ కార్యకలాపాలను కూడా ప్రేరేపించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

భారతదేశ ఆర్థిక దృక్పథం సానుకూలంగా ఉందని, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, స్థిరంగా ఉందని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అన్షుమన్ మ్యాగజీన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ ధోరణులను స్థిరీకరించడం వల్ల ఫిబ్రవరిలో ఆర్బీఐ కీలక పాలసీ రేటును తగ్గించిందని.. అలాగే తదుపరి త్రైమాసికాల్లో రెపో రేట్లలో సర్దుబాట్లు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇండియాలో లీజింగ్ వృద్ధి కొనసాగిందని, దేశీయ సంస్థలు 2023-2024 సమయంలో ఆఫీస్ లీజింగ్‌లో బలమైన పునరుజ్జీవనాన్ని ప్రదర్శించాయని, ఇది కరోనా ముందు కాలం (2018-2019) తో పోలిస్తే 86% పెరుగుదల అని నివేదిక వెల్లడించింది.

అలాగే సీబీఆర్ఈ 2024 ఇండియా ఆక్యుపియర్ సర్వే ప్రకారం, దేశీయ ఆక్రమణదారులలో 78% మంది రాబోయే రెండేళ్లలో తమ పోర్టుఫోలియోలను 10% లేదా అంతకంటే ఎక్కువ విస్తరించాలని యోచిస్తున్నట్లు తేలింది. 2024 ఊపును పెంచుకుంటూ, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు స్థిరమైన తుది-వినియోగదారు డిమాండ్ ద్వారా బలమైన వృద్ధిని కొనసాగించాలని భావిస్తున్నారని వెల్లడైంది.

This website uses cookies.