Categories: HOME LOANS

తగ్గిన హోమ్ లోన్స్

  • డిసెంబర్ త్రైమాసికంలో 9 శాతం మేర తగ్గుదల
  • విలువ పరంగా 3 శాతం తక్కువ
  • ట్రాన్స్ యూనియన్ సిబిల్ నివేదిక వెల్లడి

దేశంలో ఇంటి రుణాల సంఖ్య కాస్త తగ్గింది. గత డిసెంబర్ త్రైమాసికంలో హోమ్ లోన్స్ తీసుకున్న వారి సంఖ్య 9 శాతం మేర తక్కువగా నమోదైంది. విలువపరంగా 3 శాతం తగ్గుదల నమోదైంది. ఈ మేరకు వివరాలను క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ పేర్కొంది. రుణ వితరణ పరంగా 2024 అక్టోబర్‌-డిసెంబర్‌ కాలం రెండేళ్లలోనే అతి తక్కువ డిమాండ్‌ను చూసినట్టు వెల్లడించింది. మెట్రోల్లో రుణ విచారణలు తగ్గగా.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినట్టు తెలిపింది. మొదటిసారి రుణ గ్రహీతలు, ప్రధాన కస్టమర్లకు రుణ వితరణ 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో 21 శాతంగా ఉంటే.. 2024 డిసెంబర్‌ చివరికి 17 శాతానికి తగ్గినట్టు వివరించింది.

అలాగే గృహ రుణాల్లో బాకీలు గతేడాది ఇదే త్రైమాసికానికి 15 శాతంగా ఉంటే, అవి 2024 డిసెంబర్‌ త్రైమాసికం చివరికి 13 శాతానికి తగ్గినట్టు తెలిపింది. అధిక రిస్క్ తో కూడిన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డుల్లోనూ రుణాల సంఖ్య తగ్గినట్టు వెల్లడించింది. అన్‌ సెక్యూర్డ్‌ రుణాల విషయంలో దూకుడు తగ్గించి, నిదానంగా వెళ్లాలంటూ ఆర్‌బీఐ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలను కొన్ని త్రైమాసికాలుగా సూచించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అదే సమయంలో సెక్యూర్డ్‌ రుణ విభాగం, ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తూ, బ్యాంక్‌లకు కీలకంగా ఉన్న గృహరుణాల్లోనూ స్తబ్దత నెలకొనడాన్ని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.

This website uses cookies.