Categories: LATEST UPDATES

నగర బయ్యర్లు నారాజ్.. ఒకేసారి గోడ దెబ్బ.. చెంప దెబ్బ

తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లను కొనేవారికి ఒకేసారి గోడ దెబ్బ చెంప దెబ్బ తగిలింది. భూముల మార్కెట్ విలువల్ని పెంచే విషయంలో ఎవరూ తప్పు పట్టడం లేదు. కాకపోతే గత ఏడేళ్లుగా ఎందుకు పెంచలేదనే అంశాన్ని పలువురు నిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు.

వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ కోసం రైతులకు అధిక పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో భూముల మార్కెట్ విలువల్ని పెంచలేదనే వాదన వినిపిస్తోంది.
స్థలాల మార్కెట్ విలువ, ప్రభుత్వ విలువ మధ్య వ్యత్యాసం ఉంటే నల్లధనం పెంచుకోవచ్చని మరికొందరు అంటున్నారు. ఈ ఒక్క అంశం వల్లే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అనేక మంది ఇక్కడ భూముల్ని కొనుగోలు చేశారనే వాదన కూడా ఉంది. మరి, ఈ రెండు అంశాల్లో నిజమెంత ఉందో ఎవ్వరికీ తెలియదు.

రెండు దెబ్బలు..

ఒకేసారి భూముల మార్కెట్ విలువ.. మరోవైపు స్టాంప్ డ్యూటీని పెంచడంతో ఇళ్ల కొనుగోలుదారులకు ఆర్థిక భారం పెరుగుతోంది. ఒక ఫ్లాట్ కొనేటప్పుడు యాభై వేలు తగ్గిందనో.. లక్ష రూపాయలు తక్కువగా ఉన్నాయనో.. సొంతింటి ఎంపికను వాయిదా వేసుకున్నవారు చాలామంది మనలో ఉన్నారు. యాభై వేలు తగ్గించమని చాలామంది తమను ప్రాధేయపడతారని కొందరు డెవలపర్లు చెబుతున్నారు. కాకపోతే, సరైన రేటు రాకపోతే తాము తగ్గించలేని పరిస్థితి అని అంటున్నారు. మరి, పరిస్థితి ఇలాగుంటే.. ఒకేసారి లక్ష రూపాయలు పెరిగితే సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకానికి ఎంతో భారంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మార్కెట్ విలువల్ని పెంచి.. కొన్నాళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచితే బాగుండేదని అధిక శాతం మంది కొనుగోలుదారులు అంటున్నారు. ఈ పెంపుదల విషయంలో ప్రజలు సంతోషంగా లేరని చెబుతున్నారు. అధిక శాతం మంది ప్రభుత్వంపై నారాజ్ ఉన్నారని తెలుస్తోంది.

This website uses cookies.