- హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 80
- సాహితీని మించిన దోపిడి!
- ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి
హఫీజ్‌పేట్ సర్వే నెం. 80 స్థలంలో కోర్టు కేసు ఉందని.. టైటిల్ క్లియర్‌గా లేదని.. పశ్చిమ హైదరాబాద్‌లోని బిల్డర్లందరికీ తెలుసు. అందులో అపార్టుమెంట్లను కట్టడానికి జీహెచ్ఎంసీ అనుమతిని ఇవ్వదని తెలుసు. అయినా, బిల్డాక్స్ సంస్థ అందులో ఫ్లాట్లను నిర్మించడానికి పూనుకున్నదంటే ఏమనాలి? కళ్ల ముందే ఇంత పెద్ద అక్రమం జరుగుతుంటే.. జీహెచ్ఎంసీ ఎందుకు పట్టించుకోవట్లేదు? రెరా అథారిటీ నిద్రపోతుందా? అమాయక కొనుగోలుదారులకు ఫ్లాట్లను అంటగడుతుంటే సిట్ పోలీసులు ఏం చేస్తున్నారు? సాహితీ తరహాలో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారా? ఇంత బరితెగించి బిల్డాక్స్ ఎందుకు వ్యవహరిస్తోంది? కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలెవరైనా ఈ అక్రమ వ్యవహారంలో మిలాఖత్ అయ్యారా?
బిల్డాక్స్ సంస్థ.. జంకు బొంకు లేకుండా.. సర్వే నెం 80 స్థలంలో.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తోంది. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో రెరా ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల ధర.. చదరపు అడుక్కీ 10 నుంచి 12 వేలు పలుకుతోంది. అలాంటి స్థలంలో చదరపు అడుక్కీ రూ.4700కే ఫ్లాట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఈ ల్యాండులో కేసున్న విషయం తెలియని బయ్యర్లు వెనకాముందు చూడకుండా సొమ్ము కట్టేస్తున్నారు. ఇలా, బిల్డాక్స్ సంస్థ ఇప్పటివరకూ సుమారు రూ.200 కోట్ల దాకా వసూలు చేసిందని సమాచారం. సోషల్ మీడియా వేదికగా ఈ సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు, రియాల్టీ ఏజెంట్లు.. గజదొంగల్లా ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. ఈ అక్రమ అమ్మకాలకు అడ్డుకట్ట పడనంత కాలం.. బిల్డాక్స్ సంస్థ మరో మూడు వందల నుంచి 800 కోట్ల దాకా వసూలు చేయాలని గట్టిగా స్కెచ్ వేసిందట.
సొమ్ము వెనక్కి వస్తుందా?
బిల్డాక్స్‌కు తెలుసు.. ఇందులో అపార్టుమెంట్లను కట్టేందుకు అనుమతి రాదని.. అయినా, ప్రజలకు అనుమానం వచ్చేంతవరకూ ఇలాగే సొమ్ము వసూలు చేయాలని నిర్ణయించుకుంది. రెండు, మూడేళ్ల తర్వాత ఎవరైనా సొమ్ము ఇవ్వమని ఒత్తిడి చేస్తే.. అసలు మొత్తంలో ఎంతోకొంత వెనక్కి ఇచ్చేసి.. మిగతా సొమ్మును వెనక్కి ఇచ్చేయాలన్నది బిల్డాక్స్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. బయ్యర్లు అడిగేంతవరకూ వసూలు చేసిన కోట్ల రూపాయలపై వడ్డీని ఆస్వాదించాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. మరి, ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయకపోతే.. బిల్డాక్స్ మరో సాహితీ కేసులా తయారయ్యే ప్రమాదముంది.