దేశంలో అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనం మార్చాలని.. ప్రస్తుతం రూ.45 లక్షలుగా ఉన్న ఆ పరిమితిని రూ.75-80 లక్షలకు పెంచాలని క్రెడాయ్ పేర్కొంది. అంతే కాకుండా గృహ రుణాలకు చెల్లించే వడ్డీ మొత్తంపైనా ఆదాయపన్ను ప్రయోజనం కల్పించాలని సూచించింది. ఇలా చేయడం వల్ల అందుబాటు ధరల ఇళ్లు, మధ్య శ్రేణి ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. క్రెడాయ్ 25వ వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మీడియాతో మాట్లాడారు. నిర్మాణంలోని రూ.75-80 లక్షల ధరల్లోని ఇళ్ల ప్రాజెక్టులకు ఒక శాతం జీఎస్‌టీని అమలు చేయాలని, తద్వారా డిమాండ్ పెరుగుతుందన్నారు. ప్రస్తుతం రూ.45 లక్షల ధరల్లోపు నిర్మాణంలోని ఇళ్లకే ఒక శాతం జీఎస్‌టీ అమల్లో ఉందని, దీనిని మించిన ఇళ్లకు 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని చెప్పారు.
పైగా డెవలపర్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు వీల్లేదని వివరించారు. 2017లో రూ.45 లక్షల్లోపు ఇళ్లను అందుబాటు ధరల ఇళ్లుగా నిర్ణయించారని.. ఈ నేపథ్యంలో వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా, ఈ ధరల పరిమితి రూ.75-80లక్షలకు సవరించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. అలాగే అందుబాటు ధరల ఇళ్లకు ఎలాంటి ధరల పరిమితి విధించొద్దని క్రెడాయ్ మరో కీలక సూచన చేసింది. దీనికి బదులు మెట్రోల్లో 60 మీటర్ల కార్పెట్ ఏరియా, నాన్ మెట్రోల్లో 90 మీటర్ల కార్పెట్ ఏరియాను అందుబాటు ధరలకు పరిమితిగా కొనసాగించాలని కోరింది. పన్ను తగ్గించడం ద్వారా వినియోగదారుల చేతుల్లో నిధులు మిగులు ఉండేలా చూడాలని బొమన్ ఇరానీ ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుతం గృహ రుణాలపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24 కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉండగా, దీని స్థానంలో చెల్లించిన వడ్డీ మొత్తానికి (నూరు శాతం) పన్ను మినహాయింపు ఇవ్వాలని క్రెడాయ్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శేఖర్ పటేల్ కోరారు. నూరు శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం డిమాండ్‌ను పెద్ద ఎత్తున పెంచుతుందని ఇరానీ అభిప్రాయపడ్డారు.
This website uses cookies.