Categories: TOP STORIES

హైదరాబాద్లో గో‘డౌన్’

  • భాగ్యనగరంలో గోదాములకు తగ్గిన డిమాండ్
  • బెంగళూరు పరిస్థితి కూడా ఇంతే
  • వెస్టిన్ నివేదికలో వెల్లడి

హైదరాబాద్ లో గోడౌన్లకు డిమాండ్ స్పల్పంగా తగ్గింది. గోదాముల లీజు కార్యకలాపాలు హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కూడా తగ్గినట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టిన్‌ తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణాదిన గోదాముల డిమాండ్ తగ్గిందని.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో 2023లో మొత్తం 10.2 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్‌ నమోదైనట్టు పేర్కొంది. 2022లో లీజింగ్‌ పరిమాణం 10.7 మిలియన్‌ ఎప్‌ఎఫ్‌టీగా ఉందని తెలిపింది. థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ సంస్థలు, ఇంజనీరింగ్‌, తయారీ కంపెనీలు, ఈ-కామర్స్‌ సంస్థలు గతేడాది గోదాముల లీజింగ్‌ డిమాండ్‌లో కీలక వాటా ఆక్రమించినట్టు వివరించింది. 2022లో గోదాముల లీజింగ్‌లో ఈ మూడు దక్షిణాది పట్టణాల వాటా 34 శాతంగా ఉంటే, గతేడాది 27 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో గోదాములు, లాజిస్టిక్స్‌ వసతుల లీజింగ్‌ 21 శాతం పెరిగి 37.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 2022లో ఇది 31.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. నగరాలవారీగా చూస్తే..

హైదరాబాద్‌లో గతేడాది గోదాముల లీజింగ్‌ 3.1 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. 2022లో ఇది 3.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. బెంగళూరులో లీజింగ్‌ పరిమాణం 2022లో 4.1 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. 2023లో 3.6 మిలియన్‌ చదరపు అడుగులకు తగ్గింది. చెన్నైలో 2022లో 2.9 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్ జరగ్గా.. 2023లో అది 3.7 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది. ముంబైలో లీజింగ్ కార్యకలాపాలు బాగా పెరిగాయి. ఇక్కడ 2022లో 6 మిలియన్ చదరపు అడుగుల గోదముల లీజింగ్ జరగ్గా.. గతేడాది అది 10.2 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 2022లో 7.3 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్ జరగ్గా.. 2023లో 8.8 మిలియన్లకు పెరిగింది. పుణెలో 5.2 మిలియన్ల నుంచి 7 మిలియన్ల చదరపు అడుగులకు గోదాముల లీజింగ్‌ పెరిగినట్టు వెస్టిన్ నివేదిక పేర్కొంది. కోల్‌కతాలో గోదాముల లీజింగ్‌ 2022లో 2.1 మిలియన్‌ చదరపు అడుగులు ఉంటే, 2023లో 1.6 మిలియన్‌ చదరపు అడుగులకు తగ్గింది

This website uses cookies.