ప్రాపర్టీ కొనుగోళ్లలో పెరుగుతున్న ప్రవాసుల ప్రాభవం

  • ఎక్కువ మంది ఎన్నారైల చూపు భారత రియల్ రంగం వైపే
  • అనుకూల ఆర్థిక పరిస్థితులు, రియల్ రంగంలో సంస్కరణలే కారణం

భారత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవాస భారతీయుల ప్రాభవం పెరుగుతోంది. భారత రియల్ రంగం తమ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం అని భావించే ఎన్నారైల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు, స్థిరాస్తి రంగంలో పలు సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న కొనుగోలుదారుల ప్రాధాన్యతల వంటి అంశాలు ఎన్నారైలను స్వదేశం వైపు చూసేలా చేస్తున్నాయి. పండుగల సీజన్ ఊపందుకోవడంతోపాటు కీలకమైన లోక్ సభ ఎన్నికలు ముగియడంతో భారత రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. నిజానికి భారత రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నారైలకు ఆసక్తి పెరగడం వెనుక భావోద్వేగ, ఆర్థిక ప్రేరణలు రెండూ ఉన్నాయి. అనుకూలమైన కరెన్సీ మార్పిడి రేట్లు వారి కొనుగోలు శక్తిని పెంచగా.. రెరా, జీఎస్టీ వంటి అంశాలు భారత రియల్ రంగంలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించాయి.

అలాగే టెక్నాలజీ సైతం ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో చాలామంది డెవలపర్లు ఎన్నారైల కోసమే ప్రత్యేకంగా ప్రాజెక్టులు లాంచ్ చేసి విక్రయించేవారు. కేవలం ఎన్నారైల కోసమే కాబట్టి ధర కూడా కాస్త ఎక్కువే ఉండేది. అప్పట్లో ఇంటర్నెట్, టెక్నాలజీ వంటివి ఇప్పుడున్న విస్తృతంగా లేకపోవడం వల్ల మిగిలిన ప్రాజెక్టుల గురించి వారికి సరిగా తెలిసేది కాదు. దీంతో ఎక్కువ ధర పెట్టి ఎన్నారై ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుక్కునేవారు. అయితే, ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. ఎన్నారైల్లో ఎక్కువ మంది యువతే కావడం.. వారికి టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహన ఉండటంతో భారత రియల్ మార్కెట్లో ఏం జరుగుతోందో అక్కడి నుంచే తెలుసుకుంటున్నారు.

ప్రాపర్టీలను అక్కడ నుంచి వర్చువల్ టూర్ల ద్వారా ప్రత్యక్షంగా చూసి నిర్ణయం తీసుకుంటున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఎన్నారైలు ఇండియాలో ఆస్తి కొనాలంటే బంధువులో లేదా మధ్యవర్తులపైనో ఆధారపడాల్సి వచ్చేది. ఇంకా వారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం, బోలెడంత పేపర్ వర్క్ ఉండేది. కానీ టెక్నాలజీ ఆ పరిస్థితి దూరం చేసి, ఎన్నారైలు సులభంగా ఆస్తులు కొనుగోలు చేసే వెసులుబాటు తీసుకొచ్చింది. ఫలితంగా బోలెడంత డబ్బు, సమయం కూడా ఆదా అవుతున్నాయి. స్వదేశంతో ఉండే భావోద్వేగమైన బంధంతోపాటు భారత రియల్ రంగంలో పెట్టుబడులకు భద్రత, స్థిరత్వం ఉన్నాయనే భావన వారిని స్తిరాస్థి రంగం వైపు అడుగులు వేయిస్తోంది.

పెద్ద ప్రాజెక్టుల్లోనే పెట్టుబడులు..

ఎన్నారైలు స్వదేశంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మూలధన విలువ లేదా అద్దె ఆదాయం కోసం ప్రాపర్టీ కొనడం ఒకటైతే.. స్వదేశానికి వచ్చిన తర్వాత వ్యక్తిగత వినియోగం కోసం రెండోది. ప్రస్తుతం ఎన్నారైలు పెద్ద, మంచి ప్రాజెక్టుల్లోనే ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. విశాలమైన, సురక్షితమైన, అత్యంత సౌకర్యవంతమైన, అత్యంత అనుకూలమైన ఇళ్ల కోసమే చూస్తున్నారు. స్మార్ట్ హోం ఫీచర్లు ఉండాలని కోరుకుంటున్నారు.

అలాగే వాకింగ్ లేదా జాగింగ్ కోసం వెళ్లే అవకాశం, విశాలమైన, రద్దీ లేని పరిసరాల్లో క్రీడలు, పచ్చని బహిరంగ ప్రదేశాలు, ఫుట్ పాత్ లతో కూడిన చక్కని రోడ్లు ఎన్నారైల ఆకాంక్షల జాబితాలో ఉన్నాయి. నాణ్యతతోపాటు సకాలంలో డెలివరీ అవుతుందా లేదా అనేది కూడా చూస్తున్నారు. ప్రపంచ జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా? అనేది కూడా వారి ప్రాధాన్యతల్లో కీలకంగా ఉంది. ‘భారత స్థిరాస్తి రంగం వృద్ధి, విశ్వాసం, ఆవిష్కరణలకు పర్యాయపదంగా ఉంది. ఎన్నారైలు స్వదేశంలో అవకాశాలను అన్వేషిస్తున్నందున, వారు కేవలం ఆస్తిపై పెట్టుబడి పెట్టడమే కాకుండా భారతదేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నారు’ అని ఓ రియల్ ఎస్టేట్ నిపుణుడు వ్యాఖ్యానించారు.

This website uses cookies.