Categories: TOP STORIES

ఆతిథ్య రంగం.. అదుర్స్

  • దూసుకెళ్లనున్న పర్యాటక రంగం
  • 2024-25లో 13 శాతం మేర ఆదాయ వృద్ధి
  • హోటళ్లు, సీనియర్ సిటిజన్ హోమ్స్ కి డిమాండ్

దేశంలో ఆతిథ్య రంగం దూసుకెళ్లనుంది. 2024-25లో ఆతిథ్య రంగం ఆదాయం 11 నుంచి 13 శాతం మేర వృద్ధి చెందనుందని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. దేశీయంగా పర్యాటకానికి డిమాండ్ స్థిరంగా కొనసాగనుండటంతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని.. ఫలితంగా ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని వివరించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పర్యాటక రంగ ఆదాయం 15-17 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం రియల్ రంగంపై కూడా సానుకూలంగా ఉంటుందని..

హోటళ్లు, సీనియర్ సిటిజన్స్ హోమ్స్ కి డిమాండ్ పెరుగుతుందని విశ్లేషించింది. గదుల అద్దె రేట్లు (ఏఆర్ఆర్) సగటున ఈ ఆర్థిక సంవత్సరం 10-12 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరం 5-7 శాతం మేర పెరగవచ్చని తెలిపింది. అలాగే ఆక్యుపెన్సీ కూడా 73-74 శాతం స్థాయిలో ఉంటుందని పేర్కొంది. ఆతిథ్య రంగం డిమాండ్ పుంజుకున్నప్పటికీ.. హోటళ్లు, ఇతరత్రా రియల్ రంగం విషయంలో పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరిస్తారని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలిపారు. “స్థల సేకరణ వ్యయాలు అధికంగా ఉండటం, నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, పరిశ్రమ సైక్లికల్ స్వభావం కారణంగా లాభాలకు మళ్లాలంటే సుదీర్ఘ సమయం పట్టనుండటం వంటి అంశాల వల్ల కొత్తగా పెట్టుబడి వ్యయాలు చేయాలంటే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు’ అని కన్సల్ పేర్కొన్నారు.

This website uses cookies.