ఇల్లు పెద్దగా ఉండాల్సిందే

  • పెద్ద ఇళ్లకే మొగ్గు చూపుతున్న కొనుగోలుదారులు
  • కరోనా తర్వాత మారిన ప్రాధాన్యతలు

ఒకప్పుడు చిన్నదో, పెద్దదో సొంతిల్లు ఉండాల్సిందే అనుకునే పరిస్థితులు కనిపించేవి. కానీ మనం కొనుక్కునే ఇల్లు పెద్దగా ఉండాల్సిందేనని చాలామంది భావిస్తున్నారు. కరోనా తర్వాత ఇళ్ల కొనుగోలులో చాలా ప్రాధాన్యతలు మారాయి. వర్క్ ఫ్రం హోమ్, ఆన్ లైన్ క్లాస్, ఐసోలేషన్ రూమ్ వంటి కొత్త అవసరాలు ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉండాలనే అంశాన్ని తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు చిన్న ఇళ్లకు డిమాండ్ ఉండగా.. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. డబ్బులు ఖర్చయినా పర్వాలేదు.. పెద్ద ఇంటికే ఓటేస్తున్నారు. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నా.. ఇంటి సైజు విషయంలో వెనకడుగు వేయడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇది మరీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో ఫ్లాట్ సగటు విస్తీర్ణం 2200 చదరపు అడుగులు కావడం గమనార్హం.

2022 క్యూ1లో 1700 చదరపు అడుగులుగా ఉన్న ఫ్లాట్ సగటు విస్తీర్ణం.. 2023 క్యూ1 నాటికి 2200 చదరపు అడుగులుకు పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే పెద్ద సైజు ఇళ్లలో హైదరాబాద్ టాప్ లో ఉంది. ఇక ఢిల్లీలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1130 చదరపు అడుగుల నుంచి 1700 చదరపు అడుగులకు, బెంగళూరులో 1200 చదరపు అడుగుల నుంచి 1300 చదరపు అడుగులకు, కోల్ కతాలో 800 చదరపు అడుగుల నుంచి 1150 చదరపు అడుగులకు, పెణఎలో 877 చదరపు అడుగుల నుంచి 1013 చదరపు అడుగులకు పెరిగాయి. అయితే, ముంబైలో మాత్రం ఇందులో తగ్గుదల కనిపించింది. 2013లో 932 చదరపు అడుగులుగా ఉండగా.. 2022 క్యూ1లో 783 చదరపు అడుగులకు, 2023 క్యూ1లో 743 చదరపు అడుగులకు తగ్గిపోయింది. ఇంక సొంతిల్లు కొనేవారిలో 90 శాతం మంది అందులో నివసించడానికే కొనుగోలు చేస్తుండగా.. 10 శాతం మంది మాత్రం పెట్టుబడుల కోసం ఇళ్లు కొంటున్నారు. మొత్తం అమ్ముడవుతున్న ఇళ్లలో 38 శాతం 2 బీహెచ్ కే ఉండగా.. 26 శాతం 3 బీహెచ్ కే, 13 శాతం 1 బీహెచ్ కే, 9 శాతం 4 బీహెచ్ కే, ఒక శాతం విల్లాలు ఉంటున్నాయి.

This website uses cookies.