- గురుగ్రామ్ లో ట్రంప్ హౌసింగ్ ప్రాజెక్టు
- రూ.2200 కోట్ల వ్యయంతో నిర్మాణం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి చెందిన రియల్టీ వెంచర్ గురుగ్రామ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ‘ట్రంప్’ బ్రాండ్ కింద గురుగ్రామ్‌లో నిర్మిస్తున్న అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ ప్లాజెక్ట్ లో ఫ్లాట్ ధరలు దాదాపు ఖరారయ్యాయి. ఇందులో చదరపు అడుగు ధర రూ.27వేలుగా నిర్ధారించారు. దీనిని బట్టి చూస్తే.. ఇందులో ఫ్లాట్ ధరలు రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనున్నాయి. ఈ విషయాలను రియల్టీ సంస్థలు స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్, ట్రైబెకా డెవలపర్స్ వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుపై రూ. 2,200 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో 12 లక్షల చదరపు అడుగులతో 288 యూనిట్లను విక్రయించనున్నారు.
ఇది అయిదేళ్లలో పూర్తవుతుందని, సుమారు రూ. 3,500 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నట్లు స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్ సహ వ్యవస్థాపకుడు పంజ్ బన్సల్ తెలిపారు. ట్రంప్ బ్రాండ్‌కి అమెరికా వెలుపల భారత్ అతి పెద్ద రియల్టీ మార్కెట్‌గా మారింది. భారత్‌లో ట్రంప్ బ్రాండ్‌కి ట్రైబెకా డెవలపర్స్ సంస్థ అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా, ఈ ఒప్పందం 6 నుంచి 8 నెలల క్రితమే కుదిరినట్లు ట్రైబెకా తెలిపింది.