- బోయినపల్లి ట్రాఫిక్ ను నియంత్రించాలి
- క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు
నార్త్ హైదరాబాద్ లో ముఖ్యంగా డ్రైనేజీ చాలా పెద్ద సమస్యగా ఉందని, ప్రభుత్వం దానిని పరిష్కరించాలని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు కోరారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడారు. కొంపల్లి ప్రాంతం ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో ఇక్కడ మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బోయినపల్లి చౌరస్తా వద్ద తీవ్రంగా మారిన ట్రాఫిక్ ను నియంత్రించాలని సూచించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ బోయినపల్లి చౌరస్తాకు రాకుండా బాలానగర్ వెళ్లిపోతే 50 శాతం ట్రాఫిక్ తగ్గిపోతుందని, దానికి సంబంధించి తాము మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చినట్టు తెలిపారు. అది కేవలం 500 మీటర్ల లోపే ఉంటుందని, దానిని పూర్తిచేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరుతుందన్నారు. అలాగే కుత్బుల్లాపూర్ నుంచి షాపూర్ నగర్ నుంచి వచ్చే రోడ్డును మరింత అభివృద్ధి చేయడం లేదా ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. నార్త్ హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.